Telugu Global
National

మగపిల్లల‌కు, అమ్మాయిలంటే గౌరవం లేకుండా పోతోంది, 'నో అంటే నో' అని వారికి నేర్పించాలి -కేరళ హైకోర్టు

అత్యధికంగా లైంగిక వేధింపుల ఆరోపణలు అబ్బాయిలపైనే వస్తున్నాయని, చాలా అరుదుగా అమ్మాయిలపై కూడా వచ్చాయన్నారు. అబ్బాయిలు తమ చుట్టూ ఉన్న సమాజం, కుటుంబం ప్రభావంతో సెక్సిస్ట్ మూస పద్ధతులతో పెరుగుతున్నారని కేరళ హైకోర్టు పేర్కొంది.

మగపిల్లల‌కు, అమ్మాయిలంటే గౌరవం లేకుండా పోతోంది, నో అంటే నో అని వారికి నేర్పించాలి -కేరళ హైకోర్టు
X

పిల్లలకు, ముఖ్యంగా మగ పిల్లలకు అమ్మాయిల‌ పట్ల గౌరవం లేకుండా పోతోందని, చిన్నప్పటి నుంచే పిల్లలకు కుటుంబాలు, పాఠశాలలు అపోజిట్ జండర్ ను గౌరవించడం నేర్పించాలని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది.

కొల్లాంలోని TKM ఇంజినీరింగ్ కళాశాలలో ఆరోన్ S. జాన్ అనే వ్యక్తి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడనే కేసును హైకోర్టు జస్టిస్ దేవన్ రామచంద్రన్ విచారించి తీర్పు ఇచ్చారు.

అత్యధికంగా లైంగిక వేధింపుల ఆరోపణలు అబ్బాయిలపైనే వస్తున్నాయని, చాలా అరుదుగా అమ్మాయిలపై కూడా వచ్చాయన్నారు. అబ్బాయిలు తమ చుట్టూ ఉన్న సమాజం, కుటుంబం ప్రభావంతో సెక్సిస్ట్ మూస పద్ధతులతో పెరుగుతున్నారని పేర్కొన్నారు.

పురుషాధిక్యతకు సంబంధించిన ప్రాచీన భావనలు కొంత మారినప్పటికీ, అవి ఇంకా మారాల్సిన అవసరం ఉందని జస్టిస్ దేవన్ రామచంద్రన్ అన్నారు. ''మగపిల్లలు, పెద్దవాళ్ళు అమ్మాయిలను, స్త్రీలను గౌరవించడం కాకుండా బలాన్ని ప్రదర్శిస్తారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. చిన్నప్పటి నుంచే అబ్బాయిలకు స్త్రీలను గౌరవించడం నేర్పించాలి'' అని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.

“నిజమైన పురుషులు స్త్రీలను వేధించరని పిల్లలకు బోధించాలి. నిజానికి, బలహీనమైన‌ పురుషులే స్త్రీలపై ఆధిపత్యం చెలాయించి వేధిస్తారనే సందేశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి " అని న్యాయమూర్తి అన్నారు.

మన‌ విద్యావ్యవస్థ వ్యక్తిత్వ నిర్మాణానికి బదులుగా ర్యాంకులు, ఉద్యోగావకాశాలపై ఎక్కువ దృష్టి పెడుతోందని చెప్పిన న్యాయమూర్తి, "విద్యలో విలువల గురించి దృష్టి పెట్టాల్సిన‌ సమయం ఇది. తద్వారా మన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం" అని తెలిపారు.

“విలువలు, మంచి ప్రవర్తన తదితర అంశాలను తప్పనిసరిగా పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలి. ఉపాధ్యాయులు ప్రాథమిక తరగతి స్థాయి నుండే విద్యార్థుల్లో సద్గుణాలు, విలువలు పెంపొందించేలా ప్రోత్సహించాలి’’ అని కోర్టు పేర్కొంది. “అమ్మాయిని/స్త్రీని ఆమె అనుమతి లేకుండా తాకకూడదని అబ్బాయిలు తప్పక తెలుసుకోవాలి. ‘నో’ అంటే ‘నో’ అని అర్థం చేసుకోవాలి.” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఈ మధ్య‌ కాలంలో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినిలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, ఇది సమాజం సీరియస్ గా పట్టించుకోవాల్సిన అంశమని న్యాయమూర్తి అన్నారు.

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కూడా దీనిపై దృష్టి కేంద్రీకరించాలని,విద్యారంగంలో విధాన నిర్ణేతలు ఈ సమస్యపై దృష్టి పెట్టాలని హైకోర్టు కోరింది.

తన తీర్పు కాపీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE) వంటి విద్యా బోర్డులతో పాటు కేరళ ప్రధాన కార్యదర్శి, సాధారణ విద్యా శాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి అందజేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు.

First Published:  22 Jan 2023 3:31 AM GMT
Next Story