Telugu Global
National

ద్వేష పూరిత ప్రసంగాల నివారణకు ఎలాంటి చట్టంలేదు -'సుప్రీం' కు చెప్పిన ఎన్నికల కమిషన్

రాజకీయ పార్టీల సభ్యులు ద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు ఆయా పార్టీలపై చర్యలు తీసుకునే చట్టమేదీ లేదని ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

ద్వేష పూరిత ప్రసంగాల నివారణకు ఎలాంటి చట్టంలేదు -సుప్రీం కు చెప్పిన ఎన్నికల కమిషన్
X

ఎన్నికల సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలు, వదంతుల వ్యాప్తి నివారణకు ఎలాంటి నిర్దిష్ట చట్టం లేదని భారత ఎన్నికల కమిషన్ (ECI) సుప్రీం కోర్టుకు తెలిపింది. అందువల్ల తాము భారతీయ శిక్షాస్మృతి (IPC) , ప్రజాప్రాతినిధ్య చట్టాన్నిఆశ్రయించాల్సి వచ్చిందని ECI సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

ద్వేషపూరిత ప్రసంగాలపై లా కమిషన్ నివేదిక 267లోని సిఫార్సులను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై EC స్పందించింది.

"ద్వేషపూరిత ప్రసంగం చేయడ౦, పుకార్లు వ్యాపింపచేయడంతో వ్యక్తులను, సమాజాన్ని ఉగ్రవాదం, మారణహోమాలు, జాతి హననం వంటి చర్యలకు ప్రేరేపించే అవకాశం ఉంటుంది. " అని ఉపాధ్యాయ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

లా కమిషన్ ఆఫ్ ఇండియా, తన 267వ నివేదికలో,రాజకీయ పార్టీ సభ్యులు ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఒక రాజకీయ పార్టీని అనర్హులుగా గుర్తించే అధికారాన్ని ECIకి ఇవ్వాలా వద్దా అనే విషయంలో ఎలాంటి సిఫార్సులు చేయలేదని ECI కోర్టుకు తెలిపింది.

ప్రస్తుత చట్టాల్లో ద్వేషపూరిత ప్రసంగాలు, పుకార్లను నిలుపుదల చేయగలిగే సెక్షన్లు ఏవీ ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో సూచించలేదని వెల్లడించింది. ద్వేషాన్ని రెచ్చగొట్టడం, భయాన్ని కలిగించడం, హింసను ప్రేరేపించడం వంటి నేరాలకు శిక్ష‌ విధించేందుకు క్రిమినల్ చట్టంలో సవరణలను చేయాలని లా కమిషన్ సూచించిందని EC పేర్కొంది. దీనిపై తాము ఏమీ చేయలేమని సుప్రీం కోర్టే ఏవైనా చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్ కోరింది.

First Published:  14 Sep 2022 7:46 AM GMT
Next Story