Telugu Global
National

లాఠీలు వాడకూడదు... ఆరెస్సెస్ కు మద్రాసు హైకోర్టు ఆదేశాలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లాఠీలు ఉపయోగించ కూడదని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 2న తమిళనాడు వ్యాప్తంగా ఆ సంస్థ నిర్వహించ తలపెట్టిన ర్యాలీలకు అనుమతి ఇస్తూ హైకోర్టు పలు షరతులు విధించింది.

లాఠీలు వాడకూడదు... ఆరెస్సెస్ కు మద్రాసు హైకోర్టు ఆదేశాలు
X

అక్టోబర్ 2న తమిళనాడు అంతటా రూట్ మార్చ్‌లు నిర్వహించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ర్యాలీలలో లాఠీలు ఉపయోగించకూడదని ఆదేశించింది కోర్టు. సంస్థలోని సభ్యులెవరూ పాటలు పాడకూడదు, చెడుగా మాట్లాడకూడదు అనే అనేక షరతులతో అనుమతి మంజూరు చేసింది.

కార్యక్రమంలో పాల్గొనేవారుఏదైనా కులం, మతం లేదా వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ప్రభుత్వం నిషేధించిన సంస్థలకు అనుకూలంగా మాట్లాడకూడదు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలలో పాల్గొనకూడదు.

ఒకరిని గాయపరిచేందుకు ఉపయోగించే లాఠీలు, కర్రలతో సహా ఎలాంటి ఆయుధాలను పాల్గొనేవారు తీసుకెళ్లడానికి అనుమతి లేదని ఆర్డర్ పేర్కొంది. అంతే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో తాగునీరు, ప్రథమ చికిత్స, అంబులెన్స్‌లు, మొబైల్ టాయిలెట్లు, CCTV కెమెరాలు, అగ్నిమాపక పరికరాల కోసం కూడా ఆ సంస్థనే ఏర్పాట్లు చేయాలి. అనుమతి పొందిన మార్గాల్లో ఊరేగింపును క్రమపద్ధతిలో నిర్వహించాలని, ర్యాలీలో పాల్గొనేవారు ఎడమవైపునే ఉండాలని, సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలిగించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఊరేగింపు తప్పనిసరిగా రహదారిలో నాలుగింట ఒక వంతు మాత్రమే ఆక్రమించాలి. ట్రాఫిక్ ను, పాల్గొనేవారిని నియంత్రించడంలో పోలీసులకు సహాయపడటానికి సంస్థ తగినంత మంది వాలంటీర్‌లను ఏర్పాటు చేయాలి. పాల్గొనేవారు పోలీసులు అనుమతించిన మార్గాన్ని అనుసరించేలా ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది.

ఊరేగింపు వల్ల ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు, బాక్స్ టైప్ స్పీకర్‌లను మాత్రమే ఉపయోగించాలని, సౌండ్ అవుట్‌పుట్ 15 వాట్‌లకు మించకూడదని, ఆ బాక్స్ 30 మీటర్ల వ్యాసార్థంలో ఉండాలని ఆర్డర్ తెలిపింది. "కోన్ స్పీకర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు" అని ఆర్డర్ పేర్కొంది.

ఊరేగింపులో పాల్గొన్నవారు ఏ విధమైన మత, భాషా, సాంస్కృతిక, ఇతర సమూహాల మనోభావాలను కించపరచకూడదు. మార్చ్ సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి సంభవించే ఏదైనా నష్టానికి RSS బాధ్యత వహించాలి. అయ్యే ఖర్చును తిరిగి RSS చెల్లించాలి. ఈ షరతుల్లో దేనినైనా ఉల్లంఘిస్తే, సంబంధిత పోలీసు అధికారికి చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. అని మద్రాసు హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

First Published:  24 Sep 2022 9:03 AM GMT
Next Story