Telugu Global
National

అవినీతికి పాల్పడితే ఎంపీ, ఎమ్మెల్యేలకూ మినహాయింపుల్లేవ్‌

1998 నాటి తీర్పును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. అవినీతి పాల్పడినవారికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అవినీతికి పాల్పడితే ఎంపీ, ఎమ్మెల్యేలకూ మినహాయింపుల్లేవ్‌
X

ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా అవినీతికి పాల్పడితే ఎలాంటి మినహాయింపులూ ఉండవ‌ని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా 1998 నాటి తీర్పును న్యాయస్థానం కొట్టేసింది.

జార్ఖండ్‌ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్‌ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం తీసుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సీతా సోరెన్‌ సుప్రీంకు వెళ్లారు.

ఈ కేసుపై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? లేదా వారికి రక్షణ ఉంటుందా? అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనదని తెలిపింది. దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.

అనంతరం ఈ కేసును చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పీవీ నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

దీనిపై విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం.. సోమవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. 1998 నాటి తీర్పును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. అవినీతి పాల్పడినవారికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. లంచం తీసుకోవడం అనే ఆరోపణలు ప్రజాజీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలిపింది.

ఇంతకీ అప్పటి కేసులో ఏం జరిగిందంటే..

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా, ఆయన ప్రభుత్వం 1993లో అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. జేఎంఎం పార్టీకి చెందిన శిబు సోరెన్‌ సహా మొత్తం ఐదుగురు ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో మెజారిటీలో ఉన్న పీవీ ప్రభుత్వం గట్టెక్కింది. అయితే జేఎంఎం ఎంపీలు ఐదుగురూ లంచాలు తీసుకుని ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సోరెన్‌ సహా ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టులో సోరెన్‌ బృందానికి ఊరట లభించింది. ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో అప్పటి ధర్మాసనం తీర్పు చెప్పింది.

First Published:  4 March 2024 8:07 AM GMT
Next Story