Telugu Global
National

రేప్ కేసు నిందితుల‌కు నో గ‌వ‌ర్న‌మెంట్‌ జాబ్‌

ఉద్యోగానికి ఎంపిక చేసే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లు లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నడవడిక ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

రేప్ కేసు నిందితుల‌కు నో గ‌వ‌ర్న‌మెంట్‌ జాబ్‌
X

మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌ను అరిక‌ట్టేందుకు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అత్యాచార నిందితుల‌కు, గ‌తంలో అలాంటి చ‌రిత్ర ఉన్న‌వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌ మంగ‌ళ‌వారం ఈ విష‌యం ప్ర‌క‌టించారు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి, ఆయా ఘటనలతో ప్రమేయం ఉన్నవారికి, లైంగిక దుష్ప్రవర్తన కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింద‌ని స్ప‌ష్టం చేశారు. దీనికోసం ప్రతి పోలీస్ స్టేషన్‌లో లైంగిక నేరస్తుల జాబితాను నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఉద్యోగానికి ఎంపిక చేసే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లు లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నడవడిక ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాజస్థాన్‌లో మహిళలపై లైంగిక నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయంటూ బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అశోక్ గెహ్లాట్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రాజస్థాన్‌లో ఇటీవల మహిళలపై వరుస లైంగిక దాడులు చోటు చేసుకోవడం తెలిసిందే.

రాజస్థాన్‌లో ఇటీవల మహిళలపై వరుస లైంగిక దాడులు చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల 14 ఏళ్ల బాలికను హతమార్చి మృతదేహాన్ని ఇటుకబట్టీలో వేసి కాల్చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం క‌ఠిన చ‌ర్య‌లకు సిద్ధ‌మైంది.

First Published:  9 Aug 2023 1:31 AM GMT
Next Story