Telugu Global
National

ఏ దేవుడూ బ్రాహ్మణుడు కాడు .. JNU వీసీ వ్యాఖ్యలు

దేవుళ్ళెవరూ బ్రాహ్మలు కారని జవహర లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ అన్నారు. శివుడు కూడా ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెంది ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. మనుస్మృతి ప్రకారం మహిళలంతా శూద్రులని ఆమె అన్నారు.

ఏ దేవుడూ బ్రాహ్మణుడు కాడు .. JNU వీసీ వ్యాఖ్యలు
X

దేవుళ్లలో ఒక్కరు కూడా అగ్రవర్ణాలకు చెందిన వారు కాదని ఢిల్లీలోని జేఎన్ యూ వైస్ చాన్స్ లర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ అన్నారు. పరమశివుడు కూడా ఎస్సీ లేదా ఎస్టీకి చెంది ఉండొచ్చన్నారు. ఇటీవల చోటుచేసుకున్న మత హింస ఘటనలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మానవ శాస్త్రం ప్రకారం.. ''దేవుళ్లలో ఎవరూ బ్రాహ్మణులు కారు.. శివుడు తక్కువ బట్టలతో శ్మశానంలో ఓ సమాధి మీద కూర్చుని మెడలో పాముతో కనిపిస్తాడు..అందువల్ల ఆయన ఎస్సీ లేదా ఎస్టీ కులానికి చెందినవాడై ఉంటాడు.. నాకు తెలిసి బహుశా బ్రాహ్మణులు సమాధుల్లో కూర్చోరు'' అన్నారామె. మీలో చాలామందికి మానవ శాస్త్రం గురించి తెలిసే ఉంటుందని, అందువల్ల దీనిపై స్టడీ చేయాలని అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో తొమ్మిదేళ్ల దళిత బాలుడి హత్యను గురించి ప్రస్తావించిన ఆమె కులాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. . .. మనుస్మృతి ప్రకారం మహిళలంతా శూద్రులని, అందువల్ల ఏ మహిళ కూడా తాను బ్రాహ్మణ కులస్థురాలనో, మరే ఇతర కులానికి చెందినదాన్ననో చెప్పుకోజాలదన్నారు. అలా శుద్రురాలైన ఆమె పెళ్లి తరువాతే తన భర్త లేదా తన తండ్రికి చెందిన కులందానినని చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు. ఇది అసాధారణ తిరోగమన చర్య అవుతుందని భావిస్తున్నానన్నారు. 'జెండర్ జస్టిస్ ... డా. బీ.ఆర్.అంబేద్కర్ ఆలోచనలు.. ఉమ్మడి సివిల్ కోడ్ డీకోడింగ్' అన్న అంశం పై జరిగిన కార్యక్రమంలో శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ మాట్లాడారు. మనుస్మృతిలో మహిళలకు ఇచ్చిన స్థాయి దారుణంగా, తిరోగమనంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

దేవతల్లో శక్తి, లక్ష్మి వంటివారు కూడా అగ్ర వర్ణాలకు చెందినవారు కారని, జగన్నాథుడు గిరిజన తెగకు చెందినవాడని.. అలాంటప్పుడు మనం ఇంకా ఈ వివక్షను ఎందుకు పాటిస్తున్నామని ఆమె ప్రశ్నించారు. ఇది అమానుషం కాదా ? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలపై మనం ఎందుకు దృష్టి సారించం ? అలాంటి గొప్ప మేధావి ఈ మోడర్న్ ఇండియాలో లేరు అని శాంతిశ్రీ అన్నారు. హిందూయిజం అన్నది మతం కాదని, ఇది జీవ పరిణామ క్రమమని, అలాంటప్పుడు మనం విమర్శలకు ఎందుకు భయపడాలన్నారు. వివక్ష నుంచి మేల్కొనాలని పిలుపునిచ్చిన వారిలో గౌతమ బుద్దుడు మొదటివాడని, దీన్నే మన సమాజంలో పొందుపరిచారని శాంతిశ్రీ వ్యాఖ్యానించారు.

First Published:  23 Aug 2022 7:09 AM GMT
Next Story