Telugu Global
National

జోడో యాత్రలో రేపు పురుషులకు నో ఎంట్రీ..!!

ఇప్పుడు జోడో యాత్రలో ఒక రోజంతా పురుషులకు నో ఎంట్రీ అని చెప్పేశారు నిర్వాహకులు. రేపు (నవంబర్-19)న కేవలం మహిళలే రాహుల్ గాంధీతో కలసి నడుస్తారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్.

జోడో యాత్రలో రేపు పురుషులకు నో ఎంట్రీ..!!
X

భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఇటీవల సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో మహారాష్ట్రలో వాతావరణం వేడెక్కింది. జోడో యాత్ర అందరి దృష్టినీ మరింతగా ఆకర్షిస్తోంది. అయితే ఇప్పుడు జోడో యాత్రలో ఒక రోజంతా పురుషులకు నో ఎంట్రీ అని చెప్పేశారు నిర్వాహకులు. రేపు (నవంబర్-19)న కేవలం మహిళలే రాహుల్ గాంధీతో కలసి నడుస్తారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్. ఆ ఒక్కరోజు పురుషులకు నో ఎంట్రీ అన్నారు. రోజంతా మహిళలే రాహుల్ తోపాటు పాదయాత్రలో పాల్గొంటారని స్పష్టం చేశారు.

ఎందుకీ నిర్ణయం..

నవంబర్-19 ఇందిరాగాంధీ జయంతి. ఆ మహానాయకురాలి జయంతి సందర్భంగా మహిళా శక్తిని చూపించేందుకే జోడో యాత్రలో రాహుల్ తో కేవలం మహిళలే ముందుకు నడిచేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు జైరామ్ రమేష్. చిన్నారులు, విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులు.. ఇతరత్రా అన్ని వర్గాల వారు యాత్రలో పాల్గొంటారని చెప్పారు. దయచేసి ఆ ఒక్కరోజు పురుషులు యాత్రకు దూరంగా ఉండాలన్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో, మహిళల్ని పెద్ద ఎత్తున యాత్రకు తరలించడంలో పురుషులు సహాయం చేయాలన్నారు.

భారత్ జోడో యాత్ర నవంబర్ 19న బుల్దానా జిల్లాలోని షెగాన్ నుండి ఉదయం ప్రారంభమవుతుంది. అదే జిల్లాలోని భెండ్వాల్ వద్ద ఆరోజు యాత్ర ముగుస్తుంది. ఇటీవల అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించిన రాహుల్ గాంధీ, ఆమె త్యాగాన్ని వృథా కానివ్వబోమని పేర్కొన్నారు. ఇప్పుడామె జయంతి సందర్భంగా మహిళా శక్తిని చాటి చెప్పేందుకు, ఆమె పట్ల మహిళల్లో ఉన్న ఆరాధనా భావాన్ని తెలియజేసేందుకు పూర్తిగా రోజంతా మహిళలతో కలసి నడుస్తానన్నారు రాహుల్ గాంధీ. దీనికి తగ్గట్టుగా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

First Published:  18 Nov 2022 10:00 AM GMT
Next Story