Telugu Global
National

తమిళనాడులో సీబీఐకి నో ఎంట్రీ..

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన కొన్ని గంటలకే సీబీఐకి షాకిచ్చింది స్టాలిన్ ప్రభుత్వం.

తమిళనాడులో సీబీఐకి నో ఎంట్రీ..
X

సీబీఐకి తమిళనాడు తలుపులు మూసేసింది. తమ రాష్ట్రంలో తమ అనుమతి లేకుండా సీబీఐ ఎంట్రీని నిషేధించింది. ఈమేరకు తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీబీఐ అధికారులు తమిళనాడులో ఎవరిపై విచారణ జరపాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా తమిళనాడుకి వెళ్లి సీబీఐ పెత్తనం చలాయించడం ఇక కుదరదన్నమాట.

ఆ లిస్ట్ లో 10వ రాష్ట్రం..

గతంలో చంద్రబాబు కూడా ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ అన్నారు. ఆ తర్వాత కాలక్రమంలో సీబీఐకి ఏపీ ప్రభుత్వం తలుపులు తెరిచింది. కానీ ఇప్పటికీ దేశంలోని 9 రాష్ట్రాలు సీబీఐకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ లిస్ట్ లో 10వ రాష్ట్రంగా చేరింది తమిళనాడు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌, కేరళ, జార్ఖండ్‌, పంజాబ్‌, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో సీబీఐకి ఎంట్రీ లేదు, ఇప్పుడు తమిళనాడులో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ.. స్టాలిన్ ప్రభుత్వ అనుమతి లేకుండా కాలు మోపలేదు.

ఈడీ ఎఫెక్ట్..

తాజాగా తమిళనాడులో ఈడీ దాడులు కలకలం రేపాయి. నేరుగా రాష్ట్ర సచివాలయంలోకి ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేయడంపై సీఎం స్టాలిన్ అభ్యంతరం తెలిపారు. కేంద్రం కక్షసాధింపు ధోరణి అంటూ మండిపడ్డారు. ఏకంగా రాష్ట్ర మంత్రినే ఈడీ అరెస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన కొన్ని గంటలకే సీబీఐకి షాకిచ్చింది స్టాలిన్ ప్రభుత్వం.

First Published:  14 Jun 2023 6:00 PM GMT
Next Story