Telugu Global
National

ఎన్నికలు లేవు... కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులను నామినేట్‌ చేయనున్న ఖర్గే

CWC కి ఎన్నికలు ఉండవని పార్టీ అధ్యక్షుడే కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారని పార్టీ ప్రకటించింది. ఈ రోజు జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశం ఈమేరకు పార్టీ అధ్యక్షుడికి అధికారాన్ని అప్పగిస్తూ తీర్మానం చేసింది.

ఎన్నికలు లేవు... కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులను నామినేట్‌ చేయనున్న ఖర్గే
X

ఈ రోజు చత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈ సారి ఎన్నికల ద్వారా ఎన్నుకున్నందున CWC మెంబర్స్ ను కూడా ప్రతినిధులందరూ కలిసి ఎన్నుకుంటారనే ప్రచారం జరిగింది. ఎన్నికలు జరగాలంటూ పలువురు సభ్యులుపట్టుబడుతున్నారు కూడా.

అయితే CWC కి ఎన్నికలు ఉండవని పార్టీ అధ్యక్షుడే కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారని పార్టీ ప్రకటించింది. ఈ రోజు జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశం ఈమేరకు పార్టీ అధ్యక్షుడికి అధికారాన్ని అప్పగిస్తూ తీర్మానం చేసింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎన్నికల అంశంపై దాదాపు 45 మంది నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారని , ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్ తెలిపింది.

కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మాట్లాడుతూ.. ''స్టీరింగ్ కమిటీలో బహిరంగ చర్చ జరిగింది. సభ్యులందరూ తమ అభిప్రాయాన్ని చెప్పారు. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇవ్వాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది." అని చెప్పారు.

కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్‌ సింగ్ వంటి నేతలు సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నికకు మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్‌లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దినేష్‌ గుండూరావు తెలిపారు.

కాగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానమంత్రి అటోమెటిక్ గా CWCలో సభ్యులవుతారు. CWCలో మహిళలు, మైనారిటీలు, యువకులతో పాటు SC, ST, OBCలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని జైరాం రమేష్ తెలిపారు.

ఈ ఏకగ్రీవ నిర్ణయానికి ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులందరూ మద్దతిస్తారన్న పూర్తి విశ్వాసంతో ఉన్నామని రమేష్ తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్‌ ముఖ్య నేతలైన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కీలమైన ఈ స్టీరింగ్‌ కమిటీ సమావేశానికి దూరంగా ఉన్నారు. పార్టీ నిర్ణయాల్లో ఖర్గేకు మరింత స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ భేటీలో వారు పాల్గోలేదని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

First Published:  24 Feb 2023 12:34 PM GMT
Next Story