Telugu Global
National

పెళ్లి కాని అమ్మాయిలకు నో సెల్ ఫోన్..

లున్ సేలా గ్రామంలో సమావేశమైన ఠాకోర్ సమాజ్ సభ్యులు 11 కొత్త సంస్కరణలు చేశారు. వాటిలో పెళ్లికాని అమ్మాయిలకు సెల్ ఫోన్ నిషేధం అనేది విమర్శలకు తావిస్తోంది.

పెళ్లి కాని అమ్మాయిలకు నో సెల్ ఫోన్..
X

పెళ్లి కాని అమ్మాయిలకు సెల్ ఫోన్ ఇస్తే ఏమవుతుంది..? ప్రేమలో పడతారు, కుటుంబం పరువు తీస్తారని అంటున్నారు అక్కడి కుల పెద్దలు. మరి పెళ్లి కాని అబ్బాయికి సెల్ ఫోన్ ఇవ్వొచ్చా..? దానికి ఇబ్బందేం లేదని వితండవాదం చేస్తోంది. అమ్మాయిలు ప్రేమలో పడుతున్నారంటే, అది అబ్బాయిల వల్లే కదా. ఒకవేళ ప్రేమ వివాహాలు నిషేధించాలంటే ఇద్దరినీ కట్టడి చేయాలి కదా. కానీ వారు మాత్రం అమ్మాయిలనే టార్గెట్ చేశారు. పెళ్లి కాని అమ్మాయిలకు తమ కులస్తులెవరూ సెల్ ఫోన్ ఇవ్వొద్దంటూ తీర్మానం చేశారు. ఈ వింత నిబంధన గుజరాత్ లోని ఠాకోర్ సమాజ్ సభ్యులు తెరపైకి తెచ్చారు. ఠాకోర్ సమాజ్ లో ఇకపై ఎవరూ పెళ్లి కాని అమ్మాయిలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దని, అవసరం ఉంటే కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు మాత్రమే వారు వాడుకోవాలని హుకుం జారీ చేశారు. దీన్ని అందరూ పాటించాల్సిందేనంటూ సామూహిక ప్రతిజ్ఞబూనారు.

ఉత్తరాదిన ఖాఫ్ పంచాయత్ లలో ఇలాంటి తల తిక్క నిర్ణయాలు తీసుకుంటారనే ఆరోపణలున్నాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఖాఫ్ పంచాయత్ లు జరుగుతుంటాయి. అంతకు మించి అన్నట్టుగా గుజరాత్ లోని ఠాకోర్ వర్గం అమ్మాయిల కోసం కఠిన నిబంధనలు తయారు చేసింది. బనాస్ కాంఠా జిల్లాలోని బాబర్ తాలూకా లున్ సేలా గ్రామంలో సమావేశమైన ఠాకోర్ సమాజ్ సభ్యులు 11 కొత్త సంస్కరణలు చేశారు. వాటిలో పెళ్లికాని అమ్మాయిలకు సెల్ ఫోన్ నిషేధం అనేది విమర్శలకు తావిస్తోంది.

గిఫ్ట్ లు వద్దు, చదివింపులు ముద్దు

వివాహాల్లో డీజేల వాడకంపై కూడా నిషేధం విధించారు ఠారోక్ సమాజ్ సభ్యులు. నిశ్చితార్థానికి 11మంది, పెళ్లికి కేవలం 51మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలని, అంతకంటే ఎక్కువమందితో అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరుపుకోవడం నిషేధం అని ప్రకటించారు. పెళ్లిలో గిఫ్ట్ లు వద్దు, చదివింపులు ముద్దు అని తీర్మానం చేశారు. స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా కులపెద్దలు సూచించారు. ఠాకోర్ సమాజ్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

First Published:  22 Feb 2023 2:59 AM GMT
Next Story