Telugu Global
National

బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం..!

2000 మార్చిలో నితీష్ తొలిసారిగా బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన 2005 నవంబర్, 2010 నవంబర్, 2015 ఫిబ్రవరి, 2015 నవంబర్, 2017 జూలై, 2020 నవంబర్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం..!
X

బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నిన్న బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఆ రాష్ట్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలసి పోటీ చేయగా బీజేపీకి 77 స్థానాలు, జేడీయూకు 45 స్థానాలు వచ్చాయి. అయితే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే ఇటీవల కాలంలో నితీష్ కుమార్ బీజేపీ పెద్దల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ప్రధాని మోదీ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి తన మాట పూర్తిస్థాయిలో చెల్లుబాటు కావడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కొద్ది రోజులుగా బీజేపీ పెద్దలతో దూరంగా ఉంటూ వచ్చారు. నిన్న ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. గవర్నర్ ని కలసి సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ అందజేశారు.

ఆ తర్వాత ఆయన పాట్నాలోని రబ్రీదేవి నివాసానికి వెళ్లి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని విన్నవించారు. అందుకు ఆయన అంగీకరించడంతో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సహా మొత్తం ఏడు పార్టీలతో కలిసి మహా ఘట్ బంధన్ కూటమిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నితీష్ కుమార్ నేతృత్వంలో బృందం గవర్నర్ ని కలిసి తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు లేఖ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకరించడంతో ఇవాళ బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.కేబినెట్‌లో జేడీయూకు 14 మంత్రి పదవులు, ఆర్జేడీకి 14 మంత్రి పదవుల చొప్పున దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు లేదా నలుగురికి మంత్రి పదవి ఇవ్వనున్నారు.

8వ సారి ప్రమాణం చేసిన నితీష్

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 22 సంవత్సరాల వ్యవధిలో ఎనిమిదో సారి ఆయన ఈ పదవిని చేపట్టారు. 2000 మార్చిలో నితీష్ తొలిసారిగా బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన 2005 నవంబర్, 2010 నవంబర్, 2015 ఫిబ్రవరి, 2015 నవంబర్, 2017 జూలై, 2020 నవంబర్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో నితీష్ కుమార్ నాలుగుసార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

అంత ముందు ఎన్నికల్లో ఆర్జేడీతో కలసి పోటీ చేసిన నితీష్ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆర్జేడీ నుంచి బయటపడి బీజేపీ సహకారంతో సీఎం అయ్యారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి కూటమి తరపున ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీతో జట్టు కట్టి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లాలూ ప్ర‌సాద్‌ యాదవ్ సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి సహా పలువురు నేతలు హాజరయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్‌కు, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తేజస్వీ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీరిద్దరు మాత్రమే ప్రమాణం చేశారు. త్వరలోనే బీహార్‌లో పూర్తి స్థాయిలో క్యాబినెట్‌ను విస్తరించనున్నారు.

First Published:  10 Aug 2022 10:24 AM GMT
Next Story