Telugu Global
National

కాంగ్రెస్ కు నితీష్ కుమార్ బెస్ట్ ఛాయ‌స్..ఎందుకంటే..

బీజేపీ ని ఎదిరించడానికి ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ఎంచుకోవడం కాం గ్రెస్ పార్టీకి బెస్ట్ ఆప్షన్. నరేంద్ర మోడీని ఎదుర్కోవాలన్నా, ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లను పక్కకు తప్పించాలన్నా నితీష్ కుమార్ మాత్రమే మంచి ఎంపిక అవుతుందని రాజకీయ విశ్లేషకుల భావన‌

కాంగ్రెస్ కు నితీష్ కుమార్ బెస్ట్ ఛాయ‌స్..ఎందుకంటే..
X

అడ్డంకులు పక్కన పెడితే, విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ కాంగ్రెస్‌కు ఉత్తమమైన ఛాయిస్ కావచ్చు. అయితే ఇప్ప‌ట‌కీ రాహుల్ గాంధీ మోడీకి గట్టి సవాల్ గా నిల‌వ‌గ‌లరని పార్టీ భావిస్తోంది.

బీజేపీకి 2024లో మెజారిటీ రాద‌న‌డానికి ప్ర‌స్తుత ప‌రిణామాలే నిద‌ర్శ‌న‌మ‌ని టిఎంసి అధినేత్రి, బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్ వంటి వారు కూడా భావిస్తున్నారు. నితీష్ కుమార్ కాంగ్రెస్‌కు దీర్ఘకాలంలో ముప్పు కూడా కాదు. అందువ‌ల్ల అతని అభ్యర్థిత్వానికి మద్దతివ్వడం ద్వారా, అది మూడు లక్ష్యాలను సాధించగలదని భావించవచ్చు. బిజెపిని దెబ్బతీయడం, కేజ్రీవాల్, బెనర్జీ వంటి ప్రధానమంత్రి ఆశావహులను ఎదుర్కోవడంతో పాటు వెనుకబడిన వర్గాలలో కొంత ఆదరణ పొందడానికి వీలుంటుంద‌ని భావిస్తోంది.

నితీష్ కుమార్ కు క్లీన్ ఇమేజ్ ఉండ‌డ‌మే కాక అత‌ను ఏ వార‌స‌త్వాల‌నుంచి వ‌చ్చిన నాయ‌కుడు కాదు. అందువ‌ల్ల అవినీతి, కుటుంబ పాల‌న అంటూ బిజెపి విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉండ‌దు. నితీష్ కుమార్ కుర్మీ సామాజిక వ‌ర్గం నేత కావడంతో బీజేపీ 'ఓబీసీ పీఎం' ఆలోచ‌న‌కు ధీటుగా కౌంటర్‌గా కూడా ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో జెడియుతో క‌లిసి ఎన్డీయే 39 స్థానాలు గెలుకుంది. అందులో బిజెపి 17, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కి 6 స్థానాలు ఉన్నాయి. ఈసారి బిహార్ లో మోడీ ప్ర‌జాద‌ర‌ణను ఎదుర్కోవ‌డంలో బిహార్ నుంచి తొలి ప్ర‌ధాని అనే నినాదం ప్ర‌భావ‌వంతంగా ఉంటుంద‌నేది ఆలోచ‌న‌. ఈ సారి బిహారీని ప్రధాని అభ్య‌ర్ధిగా నిలబెట్టడం వల్ల బీహార్‌లో బీజేపీ, దాని భాగస్వాములు డిఫెన్స్‌లో పడేయ‌వ‌చ్చు.

అంతేగాక 'కుర్మీ పిఎం' నినాదం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అప్నాద‌ళ్ పార్టీతో క‌లిసి కుర్మీ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుని వార‌ణాశి ప్రాంతంలో బ‌లంగా ఉన్న కుర్మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు సాధించి ఎక్కువ సీట్లు పొందాల‌ని బిజెపి ప్ర‌య‌త్నిస్తోంది. ఆపార్టీకి చెందిన అనుప్రియ ప‌టేల్ ను నితీష్ కు వ్య‌తిరేకంగా ఫోక‌స్ చేస్తోంది. భారతీయ సమాజ్ పార్టీకి చెందిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ బిజెపి వైపు మొగ్గు చూపుతున్న‌ట్టుగా క‌న‌బ‌డుతోంది. అయితే , నితీష్ కుమార్ ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి అయితే, అతనికి మద్దతు ఇచ్చే అవ‌కాశాల‌ను తోసిపుచ్చ‌లేమ‌ని ఆయ‌న ఇప్పటికే స్ప‌ష్టంగా చెప్పారు. ఇక స‌మాజ్ వాది పార్టీ (ఎస్పీ)కి 2022 అసెంబ్లీ ఎన్ని కల్లో కుర్మీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఆ పార్టీ 2017లో ఉన్న 2 సీట్ల నుంచి గ‌త ఎన్నిక‌ల్లో 13కి పెంచుకుంది. బీజేపీ కుర్మీ ఎమ్మెల్యేల సంఖ్య గతంలో 26 ఉండగా, ప్రస్తుత అసెంబ్లీలో22కే ప‌రిమిత‌మైంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కుర్మీలు జనాభాలో 7 శాతానికి పైగా ఉన్నారు. ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కుర్మీల జ‌నాభా విస్తరించి ఉన్నప్పటికీ, బీహార్, యుపిలో రాజకీయంగా వారు చాలా ప్ర‌భావితం చేయ‌ద‌గ్గ స్థాయిలోఉన్నారు. బీహార్‌లో, కుర్మీలు జనాభాలో 3-4 శాతం మాత్రమే ఉన్నారని ఒక అంచనా. అయితే నితీష్ కుమార్ అతిపిచ్చడ (అత్యంత వెనుకబడిన తరగతులు), మహాదళితులలో ఆద‌ర‌ణ సంపాదించుకోగ‌లిగారు.

నితీష్ కుమార్ అభ్యర్థిత్వం బీహార్, యుపి, జార్ఖండ్ రాష్ట్రాల్లో త‌ప్ప ఇత‌ర ప్రాంతాల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోవ‌చ్చు. కానీ ఈ రాష్ట్రాల్లో ఉన్న 134 పార్ల‌మెంటు స్థానాలు నుంచి బిజెపి ద‌క్కించుకునేవి చాలా స్వ‌ల్స సంఖ్య‌లోనే ఉంటాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అంటే ఈ ప్రాంతంలో బిజెపికి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలే అవ‌కాశాలే ఎక్కువ‌న్న‌మాట‌.

ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో బీహారీ వలసదారుల సంఖ్య గణనీయంగా ఉంది. బీహారీ వ్య‌క్తిని పిఎం అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వ‌డం ద్వారా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు కూడా కాద‌న‌క‌పోవ‌చ్చు. అలాగే ఒక కుర్మీ ప్రధాని అభ్యర్థిగా ఉంటే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా తన కూటమి వ్యూహాల‌పై పున‌రాలోచ‌న చేసే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. నితీష్ కుమార్ వర్సెస్ నరేంద్ర మోడీ పోటీ ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించదగినవిగా అనిపించవచ్చు. ఇటువంటి స‌మ‌యంలో కాంగ్రెస్‌కు నితీష్ కుమార్ బెస్ట్ ఛాయ‌స్ గా ఉండొచ్చు. దీని వ‌ల్ల కాంగ్రెస్ కు అహం తప్ప పోయేదేమీ లేదు.

Next Story