Telugu Global
National

నితీష్ క్రియేట్ న్యూ హిస్టరీ.. ఏకంగా 9వసారి బిహార్ సీఎంగా ప్రమాణం

ఇవాళ ఉదయం నితీష్ కుమార్ మహా కూటమి నుంచి బయటికి వచ్చి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఎన్డీఏ కూటమిలో చేరి కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు.

నితీష్ క్రియేట్ న్యూ హిస్టరీ.. ఏకంగా 9వసారి బిహార్ సీఎంగా ప్రమాణం
X

జేడీయూ అధినేత నితీష్ కుమార్ బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది తొమ్మిదో సారి. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా 9సార్లు ప్రమాణ స్వీకారం చేయలేదు. తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీష్ సరికొత్త రికార్డు సృష్టించారు.

ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూలు ఉన్న మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నితీష్ ఉన్న సంగతి తెలిసిందే. మహాకూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాటు కొనసాగింది. ఇవాళ ఉదయం నితీష్ కుమార్ మహా కూటమి నుంచి బయటికి వచ్చి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఎన్డీఏ కూటమిలో చేరి కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీష్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం 9 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. మొత్తంగా జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హెచ్ఏఎం పార్టీ నుంచి ఇద్దరు, ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

First Published:  28 Jan 2024 12:57 PM GMT
Next Story