Telugu Global
National

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ చూస్తే రూ.5000 జరిమానా.!

ఏ గదిలో అయినా విద్యార్థులు గుంపులుగా చేరి మ్యాచ్ చూస్తున్నట్లు తెలిస్తే.. ఆ రూమ్ ఏ విద్యార్థికి కేటాయించారో.. అతడిని హాస్టల్ నుంచి డిబార్ చేయడమే కాకుండా.. రూ.5000 జరిమానా విధిస్తామని యాజమాన్యం హెచ్చరించింది.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ చూస్తే రూ.5000 జరిమానా.!
X

ప్రపంచంలో ఎన్నో దేశాలు క్రికెట్ ఆడుతున్నా.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ఈ రెండు దేశాల క్రీడాభిమానులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. అభిమానులు దీన్ని మ్యాచ్ అనడం కంటే యుద్ధం అని పిలుచుకుంటారు. ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. తాజాగా యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం రాత్రి 7.30కు ఇరు దేశాల మధ్య మ్యాచ్ జరుగనుంది.

ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత మ్యాచ్ చూడటానికి, గెలిస్తే సంబరాలు చేసుకోవడం కోసం ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ కారణంగా క్యాంపస్‌లో ఏవైనా గొడవలు జరుగుతాయేమో అని భావించి ఓ విద్యా సంస్థ కఠినమైన షరతులు విధించింది. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌ను విద్యార్థులు గుంపులుగా చేరి చూడవద్దని శ్రీనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) నోటీసులు జారీ చేసింది. మ్యాచ్ జరిగే సమయంలో విద్యార్థులు వారి గదుల్లోనే ఉండాలని, బయటకు రాకూడదని.. అంతే కాకుండా మ్యాచ్ సంబంధిత విషయాలను సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ చేయకూడదని హెచ్చరించింది.

ఆదివారం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందని విద్యార్థులకు తెలుసు. ఎన్నో దేశాలు దుబాయ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను ఒక ఆటగానే చూడాలి కానీ.. అనవసరమైన భావోద్వేగాలకు వెళ్లి, ఇనిస్టిట్యూట్ లేదా హాస్టల్‌లో అల్లరి చేస్తే కఠినమై చర్యలు తీసుకుంటాము అని నోటీసులో పేర్కొన్నారు. మ్యాచ్ జరిగే సమయంలో హాస్టల్ గది దాటి రావొద్దని, తమ గదుల్లోకి వేరే విద్యార్థులను అనుమతించవద్దని.. అలాగే గుంపులుగా చేరి మ్యాచ్ చూడొద్దని హెచ్చరించారు. ఏ గదిలో అయినా విద్యార్థులు గుంపులుగా చేరి మ్యాచ్ చూస్తున్నట్లు తెలిస్తే.. ఆ రూమ్ ఏ విద్యార్థికి కేటాయించారో.. అతడిని హాస్టల్ నుంచి డిబార్ చేయడమే కాకుండా.. రూ.5000 జరిమానా విధిస్తామని యాజమాన్యం హెచ్చరించింది. మ్యాచ్ జరిగే సమయంలోనే కాకుండా.. ఆ తర్వాత కూడా ఎలాంటి విషయాలను సోషల్ మీడియాలో పెట్టవద్దని చెప్పింది.

2016 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోవడంతో ఇదే విద్యా సంస్థలోని విద్యార్థుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. లోకల్, నాన్-లోకల్ విద్యార్థులకు మధ్య మొదలైన గొడవ.. హింసాత్మకంగా మారింది. దీంతో కొన్ని రోజుల పాటు ఎన్ఐటీని మూసేయాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే తాజాగా కఠినమైన షరతులతో నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.

First Published:  28 Aug 2022 7:00 AM GMT
Next Story