Telugu Global
National

బీజేపీ వైఖరిని ఎండగట్టిన నిర్మలా సీతారామన్ భర్త

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలు ఒక్కరు కూడా లేరని, రాజ్యసభలో, లోకసభలో బీజేపీ తరఫున ముస్లిం ఎంపీలు లేరని ఆయన చెప్పారు.

బీజేపీ వైఖరిని ఎండగట్టిన నిర్మలా సీతారామన్ భర్త
X

దేశ రాజకీయాల్లో ఒక్క ముస్లిం కూడా లేకుండా చేయడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరని, 20 ఏళ్ల నుంచి గుజరాత్‌లో, 15 ఏళ్ల నుంచి ఉత్తరప్రదేశ్‌లో, ఐదేళ్ల నుంచి కర్ణాటకలో బీజేపీ తరఫున ఒక్క ముస్లింకు కూడా టికెట్ ఇవ్వలేదని, భారత రాజకీయాల నుంచి ముస్లింలను ఏరివేయడమే బీజేపీ లక్ష్యమని పరకాల ప్రభాకర్ చెప్పారు.

దేశంలో ముస్లింల పరిస్థితి ముందు ముందు ఏం కాబోతుందనేదానికి మనకు చాలా నిదర్శనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఆలోచనాపరుడు పరకాల ప్రభాకర్ అన్నారు. అవేమిటో ఆయన వివరించారు. సీనియర్ జర్నలిస్టు వనజకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ ముస్లింల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. దేశంలో ముస్లింలకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేకుండా చేయడానికి బీజేపీవాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలు ఒక్కరు కూడా లేరని, రాజ్యసభలో, లోకసభలో బీజేపీ తరఫున ముస్లిం ఎంపీలు లేరని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల జనాభా ఎక్కువగా ఉందని, అయినా కూడా యూపీలో బీజేపీ నుంచి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరని ఆయన అన్నారు.

గుజరాత్ లో బీజేపీ నాలుగు దఫాలు అధికారంలో ఉందని, ఈ నాలుగు దఫాలు కూడా ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడని, కర్ణాటకలో కూడా బీజేపీ ఎమ్మెల్యేల్లో ముస్లింలు లేరని ఆయన చెప్పారు. టికెట్లు ఇచ్చి ఓడిపోవడం వల్ల ముస్లింలు లేరని అనుకోవద్దని, అసలు ముస్లిం నాయకులకు బీజేపీ టికెట్లే ఇవ్వలేదని ఆయన చెప్పారు.

ఈ పరిణామాలను బట్టి ఈ దేశంలో మీ భాగస్వామ్యం లేదని, దేశ రాజకీయాలతో మీకు సంబంధం లేదని బీజేపీ ముస్లింలకు చెప్పదలుచుకుందని అర్థమవుతోందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ముస్లింల ప్రాతినిధ్యం లేకుండా బీజేపీ చేస్తుందని చెప్పడానికి ఇవి సంకేతాలని ఆయన అన్నారు.

మణిపూర్‌లో ఏం జరుగుతుందో టీవీలు, పత్రికల సమాచారం ద్వారా తెలిసే అవకాశం లేదని, కానీ, దేశం అంటుకుందని, మొత్తం మూసేశారని ఆయన అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం ఉంటుందని తాను ఫీలవుతున్నట్లు ఆయన తెలిపారు.

First Published:  12 May 2024 3:24 AM GMT
Next Story