Telugu Global
National

10 రాష్ట్రాల్లో NIA సోదాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ అరెస్ట్ లు

ప్రధానంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై NIA దృష్టిసారించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి సంబంధించిన వారిని, వారితో సత్సంబంధాలున్నవారిని.. ఎవరినీ వదిలిపెట్టకుండా ఆరా తీస్తున్నారు.

10 రాష్ట్రాల్లో NIA సోదాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ అరెస్ట్ లు
X

ఆదివారం దేశవ్యాప్తంగా NIA సోదాలు చేపట్టగా, రెండో ఎపిసోడ్ ఈరోజు మొదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు చేపట్టారు. అన్నిచోట్లా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణకు రావాలంటూ నోటీసులిస్తున్నారు. ప్రధానంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై NIA దృష్టిసారించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి సంబంధించిన వారిని, వారితో సత్సంబంధాలున్నవారిని.. ఎవరినీ వదిలిపెట్టకుండా ఆరా తీస్తున్నారు.

ఏపీలో గుంటూరు, కర్నూలులో NIA అధికారులు తనిఖీలు నిర్వహించారు. PFIకి చెందిన ముగ్గురు కీలక అనుమానితులను NIA బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి అధికారులు సోదాలు మొదలు పెట్టారు. వహీద్, రహీమ్, జఫ్రుల్లా ఖాన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వచ్చేనెల 8న విచారణకు హాజరుకావాలంటూ మరికొందరికి నోటీసులిచ్చారు. కర్నూలులోని ఖడక్‌ పూర్‌ వీధిలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(SDPI) నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. NIA దాడులకు నిరసనగా కర్నూలులో గాంధీ విగ్రహం ముందు SDPI ఆందోళనకు దిగింది. NIAకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరాటే శిక్షణ పేరుతో PFI సంస్థ.. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి.

తెలంగాణలో టెర్రర్ ఫండింగ్ వ్యవహారంలో NIA సోదాలు చేస్తోంది. హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో సోదాలు జరిగాయి. అటు యూపీ, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కూడా PFI కార్యాలయాల్లో, PFI నాయకుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు అధికారులు. PFI, దాని విద్యార్థి విభాగానికి నిధులు సమకూర్చిన వ్యవహారంపై ఈడీ పరిశోధన చేపట్టింది. NIA, ED సంయుక్తంగా చేస్తున్న ఈ ఆపరేషన్ ను, కేంద్ర హోం శాఖ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

First Published:  22 Sep 2022 8:05 AM GMT
Next Story