Telugu Global
National

గ్యాంగ్‌స్ట‌ర్ల‌పై ఎన్ఐఏ ఉక్కుపాదం.. - దేశ‌వ్యాప్తంగా 72 ప్రాంతాల్లో దాడులు

ఉత్త‌ర భార‌త దేశంలో ప్ర‌త్యేకించి ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానాలో మాఫియా కార్య‌క‌లాపాలు పెరుగుతున్న‌ట్టు గుర్తించిన ఎన్ఐఏ ఏక‌కాలంలో ఈ దాడులు చేప‌ట్టింది.

గ్యాంగ్‌స్ట‌ర్ల‌పై ఎన్ఐఏ ఉక్కుపాదం.. - దేశ‌వ్యాప్తంగా 72 ప్రాంతాల్లో దాడులు
X

జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశ‌వ్యాప్తంగా గ్యాంగ్ స్ట‌ర్ల‌పై ఉక్కుపాదం మోపుతోంది. మంగ‌ళ‌వారం దేశంలోని 8 రాష్ట్రాల్లో గ‌ల 72 ప్రాంతాల్లో ఈ దాడులు చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ఎన్ఐఏ ఈ దాడులు నిర్వ‌హించింది. ఉత్త‌ర భార‌త దేశంలో ప్ర‌త్యేకించి ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానాలో మాఫియా కార్య‌క‌లాపాలు పెరుగుతున్న‌ట్టు గుర్తించిన ఎన్ఐఏ ఏక‌కాలంలో ఈ దాడులు చేప‌ట్టింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్‌లలో దాడులు కొనసాగుతున్నాయి.

నేర సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తున్న ఓ గ్యాంగ్ స్ట‌ర్‌పై న‌మోదైన కేసు విచార‌ణ‌లో భాగంగానే ఎన్ఐఏ ఈ దాడులు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను టార్గెట్‌గా చేసుకొని ఇలా దాడులు చేయ‌డం ఇది నాలుగోసారి కావ‌డం గ‌మ‌నార్హం.

దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇటీవ‌ల కాలంలో గ్యాంగ్‌స్ట‌ర్ల కార్య‌క‌లాపాలు పెచ్చుమీరుతున్నాయి. వారి ఉగ్ర కార్య‌క‌లాపాలు, నేరాలు ఎక్కువ‌వుతున్నాయి. మాద‌క ద్ర‌వ్యాల వ్యాపారం య‌థేచ్ఛ‌గా సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వీటిపై ఉక్కుపాదం మోపేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగి ఈ దాడులు చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు నిర్వ‌హించిన దాడుల్లో పాకిస్తాన్ నుంచి స‌ర‌ఫ‌రా చేసిన ఆయుధాలను గుర్తించిన‌ట్టు ఎన్ఐఏ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా గ్యాంగ్‌లలో భాగమైన డజన్ల కొద్దీ గ్యాంగ్‌స్టర్లను ఎన్ఐఏ విచారించిందని, ఈ సంద‌ర్భంగా సేక‌రించిన స‌మాచారం ఆధారంగా దాడులు ప్రారంభించింద‌ని స‌మాచారం. మంగళవారం జరిగిన దాడుల్లో పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ, గ్యాంగ్‌స్ట‌ర్ కార్య‌క‌లాపాల‌పై స‌మాచారం సేక‌రించిన ఎన్ఐఏ ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు ప‌ర్యాయాలు దాడులు నిర్వ‌హించిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో చాలామంది గ్యాంగ్‌స్ట‌ర్‌ల‌ను అరెస్టు చేసి క‌ఠిన మైన చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాల నివార‌ణ చ‌ట్టం కింద వారిపై కేసులు న‌మోదు చేశారు. ఈ గ్యాంగ్‌స్టర్ల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల మధ్య సంబంధాన్ని లక్ష్యంగా చేసుకుని ఐదు రాష్ట్రాల్లోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది.

First Published:  21 Feb 2023 5:55 AM GMT
Next Story