Telugu Global
National

ఎల్‌నినో ఎఫెక్ట్.. వచ్చే ఏడాదీ మండే ఎండ‌లే!

ప్రస్తుతం కొన‌సాగుతున్న ఎల్‌నినో 2024 ఏప్రిల్ వరకు ఉంటుదని, ఉష్ణోగ్రతలను పెంచేస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) ప్రకటించింది.

ఎల్‌నినో ఎఫెక్ట్.. వచ్చే ఏడాదీ మండే ఎండ‌లే!
X

ఎల్‌నినో ఎఫెక్ట్.. వచ్చే ఏడాదీ మండే ఎండ‌లే!

న‌వంబ‌ర్ నెల అంటే శీతాకాలం.. చ‌లిచ‌లి వాతావ‌ర‌ణంలో దీపావ‌ళికి స‌న్న‌ద్ధ‌మ‌య్యే స‌మ‌యం.. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్ర‌మే కాదు దేశంలో ఎక్క‌డా శీతాకాలం క‌నిపించ‌డం లేదు. హైద‌రాబాద్ లాంటి చోట్ల కూడా ఫ్యాన్లు, ఏసీలు ర‌య్యిర‌య్యిన తిరిగేస్తున్నాయి. వీట‌న్నింటికీ కార‌ణం ఎల్‌నినో. విప‌రీత‌మైన ఉష్ణోగ్ర‌త‌ల్ని పెంచేస్తున్న ఎల్‌నినో వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్ర‌క‌టించ‌డంతో 2024 కూడా ఎండ‌లు మండే కాలమే అని తేలిపోయింది.

ఎల్‌నినోతో విప‌రీత‌మైన వేడి

మధ్య పసిఫిక్ మహా సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఎల్‌నినో ఏర్ప‌డుతుంది. రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి ఈ ఎల్‌నినో ఏర్పడి 9 నుంచి 12 నెలలపాటు ప్రభావం చూపుతుంది. ఈసారి ఇంకాస్త ఎక్కువే ఉండేలా క‌న‌పిస్తోంది. భూమ్మీద, సముద్రాల్లోనూ ఉష్ణోగ్రతలను పెంచేసే ఎల్‌నినో వ‌ల్లే ఇంత వేడిగా ఉంటోంది. ప్రస్తుతం కొన‌సాగుతున్న ఎల్‌నినో 2024 ఏప్రిల్ వరకు ఉంటుదని, ఉష్ణోగ్రతలను పెంచేస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) ప్రకటించింది.

వ‌ర్షాల‌కూ ఎఫెక్టే

ఈ ఏడాది ఎల్‌నినో ప్ర‌భావంతో నైరుతి రుతుపవనాల కాలంలో చాలా తక్కువ వ‌ర్షాలు ప‌డ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో క‌ర‌వు ఛాయ‌లు వ‌చ్చేశాయి. తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్ప‌డ‌బోతోంది. ఎల్‌నినో వచ్చే ఏడాది నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఈ నెల మొద‌ట్లో ప్ర‌క‌టించింది. అయితే ఎల్‌నినో ఏప్రిల్ వ‌ర‌కు ఉంటుంద‌ని డబ్ల్యూఎంవో చెప్పిన నేప‌థ్యంలో వాన‌లు వ‌చ్చే ఏడాదైనా స‌రిగ్గా ప‌డ‌తాయా అన్న‌ది అనుమాన‌మే.

First Published:  9 Nov 2023 11:00 AM GMT
Next Story