Telugu Global
National

పెళ్లయిన కొద్దిగంటల్లోనే కొత్త జంట కొట్లాట.. ఇద్దరూ మృతి

వారి అరుపులు విన్న కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూసేసరికి లిఖిత ర‌క్త‌పు మడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నవీన్‌ కూడా తీవ్ర గాయాలపాలై ఉండటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.

పెళ్లయిన కొద్దిగంటల్లోనే కొత్త జంట కొట్లాట.. ఇద్దరూ మృతి
X

ఒకరినొకరు ప్రేమించుకొని.. పెద్దల సమక్షంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంట.. కొద్ది గంటల్లోనే కొట్లాటకు దిగింది. ఆ ఘర్షణలో నవ దంపతులు ఇద్దరూ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. ఇంత‌ విస్మయానికి గురిచేసే ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని చంబరసనహళ్లి గ్రామానికి చెందిన నవీన్‌ (26), లిఖిత (22) ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా వారి ప్రేమను అంగీకరించడంతో ఆగస్టు 7న స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో వారి వివాహం జరిగింది. నవ దంపతులిద్దరూ సాయంత్రం వరకు బంధువులతో సరదాగా గడిపారు. సాయంత్రం.. వరుడు నవీన్‌ వధువు లిఖితను, ఆమె తల్లిదండ్రులను అదే గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు.

అక్కడ నవ దంపతులిద్దరూ ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడికి దిగారు. వారి అరుపులు విన్న కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూసేసరికి లిఖిత ర‌క్త‌పు మడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నవీన్‌ కూడా తీవ్ర గాయాలపాలై ఉండటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.

నవీన్‌కి ఆస్పత్రిలో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం సాయంత్రం వరుడు నవీన్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇరు కుటుంబాలను ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవీన్, లిఖిత ఇద్దరూ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నట్టు వారు వెల్లడించారు. వారి మధ్య ఏ విషయంలో ఘర్షణ జరిగింది.. ఎందుకు ఒకరినొకరు చంపుకునేంతలా దాడి చేసుకున్నారనే విషయం ఇంకా తేలలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

First Published:  9 Aug 2024 3:54 AM GMT
Next Story