Telugu Global
National

75 ఏళ్ల‌ స్వతంత్ర భారతి ... డోలీలో ఆసుపత్రికి..

నెలలు నిండకుండా పుట్టిన కవల పిల్లలు... తల్లి కళ్ల ముందే చనిపోయారు. ఇంట్లోనే ప్రసవించిన ఆ తల్లిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ల‌డానికి ఆ గ్రామానికి తగిన రోడ్డు సదుపాయం లేకపోవడం వలన... ఆ శిశువుల ప్రాణాలు దక్కలేదు.

75 ఏళ్ల‌ స్వతంత్ర భారతి ... డోలీలో ఆసుపత్రికి..
X

'అందరికీ విద్య, వైద్యం..' 75 ఏళ్ల స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ఈ సందర్భంలో కూడా ఇవి రెండూ ఇంకా దేశం సాధించాల్సిన లక్ష్యాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా వైద్యం అందక సంభవిస్తున్న మరణాలు, దారుణాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. నెలలు నిండకుండా పుట్టిన కవల పిల్లలు... తల్లి కళ్ల ముందే చనిపోయారు. ఇంట్లోనే ప్రసవించిన ఆ తల్లిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ల‌డానికి ఆ గ్రామానికి తగిన రోడ్డు సదుపాయం లేకపోవడం వలన... ఆ శిశువుల ప్రాణాలు దక్కలేదు. ప్రసవం అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్నబాలింతను ఊరి జనం, కుటుంబ స‌భ్యులు... డోలి వంటిది తయారు చేసుకుని మూడు కిలోమీటర్లు నడిచి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చారు. కాలు జారి పడిపోయేలా ఉన్న ఏటవాలు కొండ ప్రాంతం దాటి వారు ఆమెని ఆసుపత్రికి మోసుకెళ్లారు. దారంతా ఆమెకు రక్తస్రావం జరుగుతూనే ఉంది.

పాల్ఘర్ జిల్లాలోని మొఖాడ అనే ప్రాంతానికి చెందిన వందన బుధార్ గర్భం దాల్చిన ఏడు నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవం ఇంటి వద్దనే జరిగింది. నెలలు నిండకుండా పుట్టిన శిశువులు సరైన వైద్యం అందని పరిస్థితుల్లో పుట్టిన వెంటనే మరణించారు. తరువాత రక్తస్రావం ఆగకపోవటంతో కుటుంబ సభ్యులు తాళ్లు, కర్రలు దుప్పట్లతో డోలి తయారు చేసి ఆమెను ఆసుపత్రికి మోసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర కిషోర్ వాఘ్ ఈ సంఘటనపై స్పందిస్తూ... 'చాలా బాధాకరం' అంటూ ట్వీట్ చేశారు. సమయానికి తగిన వైద్య సదుపాయాలు అందకపోవటం వలన బుధార్ కవల పిల్లలు మరణించారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో సరైన రోడ్లు లేకపోవటం వలన ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల దృష్టికి తీసుకువెళతామని తన ట్వీట్‌లో పేర్కొన్నారామె. దేశం 75 ఏళ్ల‌ స్వాతంత్య్ర‌ దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న దశలో పేద ప్రజలు ఇంకా ఇలాంటి కష్టాలు పడటం చాలా దురదృష్టమన్నారు బిజెపి జాతీయ కార్యదర్శి పంకజ్ ముండె.

నిజంగా దురదృష్టమే.. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా... రాజకీయ నేతలు, నాయకులు వాటిని చూస్తూనే ఉన్నా... అవి మరోసారి జరగరాని ఘోరాలే అయినా... తిరిగి అవే మన కళ్లముందు యధాలాపంగా జరుగుతూనే ఉండటం... మరింత దురదృష్టకరమైన విషయం.

First Published:  17 Aug 2022 10:16 AM GMT
Next Story