Telugu Global
National

సానియా-షోయబ్ విడాకుల వ్యవహారంలో ట్విస్ట్

ఈ ఫొటోలను చూసిన సానియా బెస్ట్ ఫ్రెండ్.. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ స్పందిస్తూ.. నీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క నిజమైన ప్రేమ ఇజహాన్.. అంటూ కామెంట్ చేశారు

సానియా-షోయబ్ విడాకుల వ్యవహారంలో ట్విస్ట్
X

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇజహాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే షోయబ్ - సానియా మీర్జా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ముందుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ పాక్ మీడియాలో వార్తలు రాగా భారత్ లో కూడా ప్రధాన మీడియా సంస్థలు షోయబ్ -సానియా మీర్జా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు ప్రచురించాయి.

ప్రస్తుతం విడాకుల ప్రక్రియ జరుగుతోందని.. అది పూర్తి కాగానే ఇద్దరూ తమ విడాకులపై ప్రకటన చేస్తారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, అటు పాకిస్తాన్‌లో ఇటు ఇండియాలో షోయబ్ - సానియా విడాకుల వార్తలు వచ్చినప్పటికీ వారిద్దరూ ఖండించలేదు. 'ఇది మా వ్యక్తిగతం. ఈ ప్రశ్నకు నేను, నా భార్య సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వదిలేయండి' అని కొద్దిరోజుల కిందట షోయబ్ మీడియాతో పేర్కొన్నారు.

కాగా, కొద్ది రోజుల కిందట దుబాయ్ లో షోయబ్, సానియాల కుమారుడు ఇజహాన్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ముగ్గురు కలసి ఉన్న ఫొటోలను షోయబ్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగా.. సానియా మీర్జా మాత్రం కేవలం తన కుమారుడితో కలిసి ఉన్న ఫొటోలు మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను చూసిన సానియా బెస్ట్ ఫ్రెండ్.. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ స్పందిస్తూ.. నీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క నిజమైన ప్రేమ ఇజహాన్.. అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత కూడా సానియా మీర్జా ఇన్ స్టా గ్రామ్ లో 'ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది' అని ఒక కామెంట్ పోస్ట్ చేశారు. వీటన్నింటిని బట్టి షోయబ్ -సానియా విడిపోతున్నారని అంతా భావించారు.

అయితే తాజాగా షోయబ్ మాలిక్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. తన ఇన్ స్టా బయోలో తాను అథ్లెట్, సూపర్ ఉమెన్ సానియా మీర్జాకు భర్తను అని, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్ ను బట్టి షోయబ్ తనకు, తన భార్య కుమారుడు అంటే ఎంత ఇష్టమో తెలియజేశాడు. ఒకవైపు సానియాపై షోయబ్ తన ప్రేమను వ్యక్తం చేయగా.. మరోవైపు సానియా మాత్రం సోలో గానే ఇటీవల ఫొటోషూట్స్ చేస్తోంది. బయట కూడా ఒంటరిగానే కనిపిస్తోంది. తాజాగా ఖతర్ వేదికగా అర్జెంటీనా -క్రోయోషియా మధ్య మ్యాచ్ జరుగగా సానియా తన సోదరితో కలిసి మైదానానికి వచ్చింది. ఈ నేపథ్యంలో వీరి విడాకుల వ్యవహారం ఎవరికీ అంతుపట్టడం లేదు. షోయబ్, సానియాలలో ఎవరో ఒకరు స్పందించి విడాకుల పై క్లారిటీ ఇస్తే తప్ప అసలు విషయం బయటపడే అవకాశం కనిపించడం లేదు.

First Published:  15 Dec 2022 5:47 AM GMT
Next Story