Telugu Global
National

విమాన సిబ్బంది సెంటు కొట్టొద్దు.. డీజీసీఏ నిర్ణయం

ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న పెర్ఫ్యూమ్స్ తోపాటు.. మౌత్ వాష్, టూత్ జెల్.. వంటి వాటిని కూడా విమాన సిబ్బంది వాడకుండా ఉంటే మంచిదని చెబుతోంది DGCA. ఈమేరకు ఓ ముసాయిదా రూపొందించింది.

విమాన సిబ్బంది సెంటు కొట్టొద్దు.. డీజీసీఏ నిర్ణయం
X

ఆఫీస్ పనిమీద అయినా, ఇతర పనులమీద అయినా ఇంట్లోనుంచి బయటకు వస్తుంటే సెంటు కొట్టడం చాలామందికి అలవాటు. విమానాల్లో పనిచేసే సిబ్బంది కూడా సెంటు కొట్టుకుని డ్యూటీకి రావడం సహజమే. దేశ విదేశాలు తిరిగే విమాన సంస్థల సిబ్బంది కూడా రకరకాల పెర్ఫ్యూమ్ లు వాడుతుంటారు. కానీ ఇకపై అలా వాడాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెబుతోంది భార‌త పౌర విమాన‌యాన డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ (DGCA). దీనికి బలమైన కారణం కూడా ఉంది. సెంటు కొట్టిన సిబ్బంది బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఫెయిలవుతున్నారు. ఎందుకంటే, వారు వాడే సెంటులో ఆల్కహాల్ పర్సంటేజ్ కాస్త ఎక్కువగా ఉంటోంది. దీంతో DGCA ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.





ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న పెర్ఫ్యూమ్స్ తోపాటు.. మౌత్ వాష్, టూత్ జెల్.. వంటి వాటిని కూడా విమాన సిబ్బంది వాడకుండా ఉంటే మంచిదని చెబుతోంది DGCA. ఈమేరకు ఓ ముసాయిదా రూపొందించింది. ఈ రంగంలోని వారంద‌రి అభిప్రాయాల కోసం ఈ ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌ లో ఉంచుతున్నామ‌ని DGCA ప్రకటించింది.

అనుమతి తప్పనిసరి..

ఇటీవల బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఇబ్బందిపడిన చాలామంది విషయంలో ఇలాంటి పొరపాటు జరిగినట్టు DGCA గుర్తించింది. వారందరూ ఆల్కహాల్ కలసిన పెర్ఫ్యూమ్ వాడటమో లేదా, ఆల్కహాల్ పర్సంటేజి ఎక్కువగా ఉన్న మౌత్ వాష్ లను ఉపయోగించడమో చేశారు. దీంతో వారు బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ వాడినట్టుగా తేలింది. కానీ వాస్తవానికి వారెవరూ ఉద్దేశపూర్వకంగా ఆల్కహాల్ ని తీసుకోలేదు. ఈ సమస్యల కారణంగా DGCA కొత్త ముసాయిదా తీసుకొచ్చింది. మినహాయింపు కావాలనుకునేవారు.. ఫ్లైయింగ్ అసైన్‌ మెంట్ చేప‌ట్టేముందు కంపెనీ డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల‌ని DGCA చీఫ్ వెల్ల‌డించారు.

First Published:  2 Oct 2023 2:19 PM GMT
Next Story