Telugu Global
National

అయోధ్యలో బాలరాముడి పేరు మార్పు

అనుకున్నట్లుగానే నిన్న బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి అయోధ్య రాముడిని కొందరు రామ్ లల్లాగా మరికొందరు బాల రాముడిగా పిలుస్తున్నారు.

అయోధ్యలో బాలరాముడి పేరు మార్పు
X

ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయోధ్యకు రాముడు మళ్లీ తిరిగి రావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు శ్రీరాముడి దర్శనానికి భారీగా తరలి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అయోధ్యలో కొలువైన బాల రాముడి పేరు మార్పు చేశారు. 'బాలక్ రామ్' గా పిలవాలని నిర్ణయించారు. అయోధ్యలో కొలువైన రాముడిని మొదటినుంచి రామ్ లల్లాగా పిలుస్తూ వస్తున్నారు. అయితే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న సమయంలో సీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్ర‌హాల‌ను ప్రతిష్ఠిస్తారని అంతా భావించారు.

అయితే అనూహ్యంగా అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే నిన్న బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి అయోధ్య రాముడిని కొందరు రామ్ లల్లాగా మరికొందరు బాల రాముడిగా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై బాల రాముడిని 'బాలక్ రామ్' గా పిలవనున్నట్లు ఆలయ ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు.

ఆలయంలో కొలువుతీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసి బాలుడు కావడంతో బాలక్ రామ్ గా పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆలయాన్ని కూడా బాలక్ రామ్ మందిర్ గా పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయోధ్యలో ప్రతిష్ఠించిన రాముడి విగ్రహం బాల రాముడిని పోలి ఉండడంతోనే ఈ పేరు నిర్ణయించినట్లు అరుణ్ దీక్షిత్ చెప్పారు.

అయోధ్యలో నిన్న బాల రాముడి ప్రతిష్ఠాపన పూర్తయింది. అయితే నిన్న సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించలేదు. అందిన ఆహ్వానం మేరకు అయోధ్యకు వచ్చిన ప్రముఖులకు మాత్రమే శ్రీరాముడి దర్శనం కల్పించారు. అయోధ్యలో ఇవాళ ఉదయం నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. అయితే ఊహించిన దాని కంటే భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు తరలివస్తుండడంతో దర్శన వేళలు మరింత పెంచాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

First Published:  23 Jan 2024 3:43 PM GMT
Next Story