Telugu Global
National

ప్రధాని కాదు, రాష్ట్రపతి ప్రారంభించాలి.. సుప్రీంలో పిల్

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ప్రారంభించేలా లోక్‌ స‌భ సెక్ర‌టేరియేట్‌, కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలివ్వాలని.. సుప్రీంకోర్టులో ఈరోజు పిల్ దాఖలైంది.

ప్రధాని కాదు, రాష్ట్రపతి ప్రారంభించాలి.. సుప్రీంలో పిల్
X

నూతన పార్లమెంట్ భ‌వ‌నం ప్రారంభోత్సవం దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 28న ప్రధాని నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. ఆ హక్కు ఆయనకెక్కడిదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ ని రాష్ట్రపతి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ 19 విపక్ష పార్టీలు ఓ లేఖ విడుదల చేశాయి. వారి ధిక్కారాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ అనుకూల పార్టీలు కూడా తమ స్వరం వినిపించాయి. ఈ దశలో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్ట్ లో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలైంది.

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ప్రారంభించేలా లోక్‌ స‌భ సెక్ర‌టేరియేట్‌, కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలివ్వాలని.. సుప్రీంకోర్టులో ఈరోజు పిల్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయ‌ర్ సీఆర్ జ‌య సుకిన్ ఈ పిటిష‌న్ దాఖలు చేశారు. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్యక్రమంలో కనీసం రాష్ట్ర‌ప‌తి పేరును చేర్చ‌లేద‌ని ఈ పిల్ లో ప్రస్తావించారు. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించాలనుకోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు.

పార్ల‌మెంట్ అనేది సుప్రీం లెజిస్టేటివ్ సంస్థ అని, పార్ల‌మెంట్‌ అంటే లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రపతి మూడు వ్యవస్థలు కలిపే ఉంటాయని పిల్ లో లాయర్ సీఆర్ జయసుకిన్ గుర్తు చేశారు. ఉభ‌య‌ స‌భ‌ల‌కు స‌మ‌న్లు జారీ చేసి, ప్రొరోగ్ చేసే అధికారం కూడా రాష్ట్ర‌ప‌తికే ఉంటుందని ప్రస్తావించారు. రాష్ట్ర‌ప‌తిని ప్రారంభోత్స‌వానికి ఆహ్వానించ‌క‌పోవ‌డం అసంబద్ధంగా ఉంద‌న్నారు.

First Published:  25 May 2023 10:22 AM GMT
Next Story