Telugu Global
National

కాంగ్రెస్ కి కొత్త తలనొప్పి.. అప్పుడు జి-23 ఇప్పుడు జి-5

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటూ ఐదుగురు ఎంపీలు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఐదుగురు ఎంపీల్లో.. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న శశిథరూర్ కూడా ఉండటం విశేషం.

కాంగ్రెస్ కి కొత్త తలనొప్పి.. అప్పుడు జి-23 ఇప్పుడు జి-5
X

పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ, కాంగ్రెస్ కి కొత్త తలనొప్పి మొదలైంది. అప్పట్లో జి-23 నాయకులు లేఖాస్త్రం సంధించినట్టు, ఇప్పుడు ఐదుగురు ఎంపీల గ్రూప్ (జి-5) మరో లేఖ రాసింది. అయితే ఈ లేఖ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల గురించి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటూ ఐదుగురు ఎంపీలు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఐదుగురు ఎంపీల్లో.. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న శశిథరూర్ కూడా ఉండటం విశేషం.

గోరు చుట్టుపై రోకలి పోటా..

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని అంటున్నారు. సీనియర్లంతా పార్టీని వీడుతున్నారు, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ దశలో రాహుల్ భారత్ జోడో యాత్రని మొదలు పెట్టారు. ఇప్పటి వరకూ అధ్యక్ష పీఠం తనకి ఇష్టం లేదని చెబుతూ వచ్చిన ఆయన, ఇటీవల మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆరోజు ఏం జరుగుతుందో వేచి చూడండి అని చెప్పారాయన. అయితే అంతలోనే ఐదుగురు ఎంపీలు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై రాసిన లేఖ కలకలం రేపింది.

అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్ష ఎన్నిక జరగాల్సి ఉండగా, ఐదుగురు ఎంపీలు ఏఐసీసీ ఎన్నికల చీఫ్‌ మధుసూధన్‌ మిస్త్రీకి లేఖ రాశారు. శ‌శిథ‌రూర్‌, మనీష్‌ తివారీ, కార్తి చిదంబ‌రం, ప్ర‌ద్యూత్ బోర్డోలై, అబ్దుల్ ఖ‌లీక్‌ ఉమ్మడిగా ఈ లేఖ‌ రాశారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని వారు ఆ లేఖలో కోరారు. ఎల‌క్టోర‌ల్ బాండ్లకు చెందిన అంశంపై త‌ప్పుడు స‌మాచారం బయటకు రావడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఎంపీలు ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొనే ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌తినిధుల‌తో కూడిన ఎల‌క్టోర‌ల్ కాలేజీని రిలీజ్ చేయాల‌ని ఎంపీలు త‌మ లేఖ‌లో డిమాండ్ చేశారు.

ఎందుకిదంతా..?

రాహుల్ గాంధీ పోటీలో లేకపోయినా, గాంధీ కుటుంబం సూచించిన వ్యక్తినే పార్టీ నేతలు ఎన్నుకోక తప్పని పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది. సో.. రాహుల్ కాకపోతే, రాహుల్ నమ్మినబంటు అక్కడ ఉంటారు. అంటే గాంధీ కుటుంబం చేతిలోనే పగ్గాలు ఉండిపోతాయన్నమాట. ఈ దశలో శశిథరూర్ సహా ఇంకెవరు పోటీ చేసినా వారికి ఓట్లు వేసేవారు ఉంటారా, అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అనేది సందేహమే. అందుకే వారు ఎలక్టోరల్ కాలేజీని విడుదల చేయాలని ఏఐసీసీ ఎన్నికల చీఫ్ కి లేఖ రాశారు. ఇప్పుడే కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం ఇంత వేడెక్కితే, ఇక నామినేషన్లు మొదలైతే ఇంకెంత హడావిడి ఉంటుందో చూడాలి.

First Published:  10 Sep 2022 2:29 PM GMT
Next Story