Telugu Global
National

చాపకింద నీరులా జ్వరాలు.. పలు రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు

ఈ సారి కేంద్రం పెద్దగా హెచ్చరికలు చేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యాయి. హర్యానాలో మాస్క్ నిబంధన అమలులోకి వచ్చింది.

చాపకింద నీరులా జ్వరాలు.. పలు రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు
X

నేరుగా కరోనా అని చెప్పలేం కానీ.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల జ్వర పీడితుల సంఖ్య ఎక్కువవుతోంది. జ్వరం వస్తే పారాసెట్మాల్ తో తగ్గిపోతుందని అనుకుంటున్నవారు కూడా.. వారం రోజులు వదిలిపెట్టకుండా జ్వరం కాస్తుంటే ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీనికితోడు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందంటూ కేంద్రం రోజువారీ కొత్త లిస్ట్ విడుదల చేస్తుండే సరికి అనుమానితులు కూడా ఆలస్యం చేయకుండా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కొత్త వేవ్ వచ్చిందని అప్పుడే నిర్థారించలేం కానీ.. కేసుల సంఖ్య, అనారోగ్యంతో ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య మాత్రం పెరుగుతుందని చెప్పక తప్పదు.

కొత్తగా 5,357 కేసులు..

ఆదివారం ఉదయం కేంద్రం కొత్త లిస్ట్ విడుదల చేసింది. గడచిన 24 గంటల వ్యవధిలో 5,357 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,814 గా ఉంది. ఒకరోజులో 11 మంది కరోనా లక్షణాలతో మరణించారు. ఈ లెక్కలతో జనంలో భయం పెరిగిపోతోంది.

ప్రభుత్వాల అప్రమత్తత..

జనంలో భయం ఎలా ఉన్నా.. ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తం అయ్యాయి. ఈ సారి కేంద్రం పెద్దగా హెచ్చరికలు చేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యాయి. హర్యానాలో మాస్క్ నిబంధన అమలులోకి వచ్చింది. జన సమూహాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కేరళలో గర్భిణులు, ముసలివారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు తగినంత ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉత్తర ప్రదేశ్ లోని విమానాశ్రయాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ గా తేలిన శాంపిల్స్ ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కు పంపిస్తున్నారు.

ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా మాస్క్ నిబంధన మొదలైంది. ఇటు తెలంగాణలో కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ర్యాండమ్ గా కొవిడ్ పరీక్షలకోసం శాంపిల్స్ తీసుకుంటున్నారు. మరోవైపు ప్రజల్లో స్వచ్ఛందంగా మాస్క్ వాడకం పెరిగింది.

First Published:  9 April 2023 9:37 AM GMT
Next Story