Telugu Global
National

బీజేపీ పాపం.. వరిసాగు పతనం..

అందుకే `పీయూష్ గోల్ మాల్` అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటీవల ఆయనపై చెణుకులు విసిరారు.

బీజేపీ పాపం.. వరిసాగు పతనం..
X

వరిసాగు పెంచండి.. లేకపోతే భవిష్యత్తులో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందంటూ.. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ రాష్ట్రాలకు ఉపదేశమిచ్చారు. ఇదే మంత్రి గతంలో తెలంగాణ నేతలు వరిధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో ఆందోళన చేస్తే అపహాస్యం చేశారు. కేంద్రం కొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అందుకే `పీయూష్ గోల్ మాల్` అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటీవల ఆయనపై చెణుకులు విసిరారు.

ఇప్పుడేమైంది.. పరిస్థితి తారుమారైంది. పరిమితికి మించి వరిధాన్యం పండిస్తే మేం కొనలేమంటూ చేతులెత్తేసిన కేంద్రం.. ఇప్పుడు వరి పండించండి అంటూ రాష్ట్రాలను బతిమిలాడుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వరి సాగుబడి దారుణంగా పడిపోయింది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ లో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. పదేళ్ల కాలంలో తొలిసారిగా ఈ ఏడాది వరిసాగు 24 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే జూలై 8 నాటికి తెలంగాణలోనూ వరి సాగు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం, పప్పు ధాన్యాలు, నూనెగింజల మద్దతు ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. అందుకే వరి సాగుబడి తగ్గింది.

ఈనెల 8న వ్యవసాయ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఏడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 94.99 లక్షల హెక్టార్లలో వరినాట్లు వేశారు. ఈ ఏడాది కేవలం 72.24 లక్షల హెక్టార్లలో (24% తక్కువ) మాత్రమే వరినాట్లు పడ్డాయి. 2012 జూలై 11 నాటికి 96.7 లక్షల హెక్టార్లలో వరిసాగు కాగా, ఆ తర్వాత ఏడాదిలో గరిష్టంగా 1.25 కోట్ల హెక్టార్ల మేర సాగుచేశారు. వరి ఎక్కువగా సాగు చేసే ఛత్తీస్‌ గఢ్‌ లెక్కలు తీస్తే, గతేడాది ఇదే సమయానికి 15.14 లక్షల హెక్టార్లలో సాగు జరగగా, ఈ ఏడాది ఏకంగా 6.19 లక్షల హెక్టార్ల మేర తగ్గి కేవలం 8.95 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. తెలంగాణలో గత ఏడాది జూలై 8 నాటికి 93 వేల హెక్టార్లలో వరి వేయగా, ఈ ఏడాది కేవలం 53 వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది.

పాపం కేంద్రానిదే..

వైఫల్యాన్ని రుతుపవనాలపైకి నెట్టేస్తున్నా.. వరికి మద్దతు ధర పెంచకపోవడం కేంద్రం చేసిన పాపమేనంటున్నారు నిపుణులు. కనీసం మద్దతు ధర పెంచకపోయినా, కేంద్రం కొంటుందన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేంద్రంతో కొట్లాడింది. అయినా కేంద్రం మనసు కరగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం సేకరించింది.

వరి సాగు విస్తీర్ణం తగ్గితే దాని ప్రభావం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు సరఫరా చేసే బియ్యం పంపిణీపై పడుతుంది. అందుకే కేంద్రం ముందు జాగ్రత్తచర్యలు తీసుకుంటోంది. తన తప్పుని కప్పి పుచ్చుకుంటూ.. రాష్ట్రాలు ఉత్పత్తి పెంచాలని సూచిస్తోంది. దేశంలో బియ్యం నిల్వలకు కొరత లేదని, అంతర్జాతీయ డిమాండ్‌ దృష్ట్యా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే మంచి ధర వస్తుందని చెబుతున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. వరి పంటను గణనీయంగా పెంచి, దేశానికి అన్నపూర్ణగా మారిన తెలంగాణ విషయంలో వారు చేసిన పాపమే, ఇప్పుడు శాపంగా మారే అవకాశముంది. బీజేపీ తెలివితక్కువ విధానాల వల్లే దేశవ్యాప్తంగా వరిసాగు తగ్గింది. ఆహార సంక్షోభం పొంచి ఉంది.

First Published:  15 July 2022 8:01 AM GMT
Next Story