Telugu Global
National

గంగ శుద్ధిలో 10వేల కోట్ల అవినీతి కంపు..

మరి `నమామి గంగే` కోసం విడుదలైన 10,792 కోట్ల రూపాయలు ఏమయ్యాయి. మురుగు కంపుకి అవినీతి కంపు తోడవడంతో 10వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.

గంగ శుద్ధిలో 10వేల కోట్ల అవినీతి కంపు..
X

గంగానది ప్రక్షాళణ కోసం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక `నమామి గంగే` అనే ప్రాజెక్ట్ చేపట్టింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు ఈ పథకం కోసం మోదీ సర్కారు రూ.15,074.88 కోట్లు మంజూరు చేసి, రూ.10,792.02 కోట్లు విడుదల చేసింది. అయితే ఇంతవరకు పురోగతి లేదు. ఇటీవల గంగా నది పరిశీలనకు వచ్చిన ఎన్జీటీ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికీ గంగా పరిసరాలు అపరిశుభ్రంగానే ఉన్నాయి. గంగలో వ్యర్థాలు కలుస్తూనే ఉన్నాయి. ఎక్కడా దేనికీ అడ్డుకట్ట పడలేదు. మరి `నమామి గంగే` కోసం విడుదలైన 10,792 కోట్ల రూపాయలు ఏమయ్యాయి. మురుగు కంపుకి అవినీతి కంపు తోడవడంతో 10వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.

గంగానది పరివాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ కు ఈ నిధులను మళ్లించారు. కానీ ఎక్కడా గంగానది ప్రక్షాళణకు ముందడుగు పడలేదు. ఇది ప్రతిపక్షాల విమర్శ కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెల్లడించిన సత్యం. వ్యవసాయ, మానవ వ్యర్థాలతోపాటు పారిశ్రామిక వ్యర్థాలు కూడా నదిలోకి నేరుగా వదులుతున్నారని, దీంతో నది తీవ్రంగా కలుషితమవుతోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం గంగా నదిలో 50 శాతం నీరు మురుగేనని ఎన్జీటీ వ్యాఖ్యానించటం ప్రాజెక్ట్ దుస్థితికి అద్దం పడుతోంది.

గంగా నది శుద్ధికి నిర్దేశించిన లక్ష్యాలేవీ నెరవేరకపోవటానికి ఎవరూ బాధ్యత వహించడం లేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విభాగాలు ఒకదానిపై మరొకటి నింద వేసుకోవడం మినహా సాధించిందేమీ లేదని స్పష్టం చేసింది ఎన్జీటీ. గంగా కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తున్నవారి ఆలోచనా విధానంలో మార్పు రావాలని చెప్పారు ఎన్జీటీ అధికారులు. లేదంటే ఎంతకాలమైనా, ఎన్నివేల కోట్ల నిధులు విడుదలైనా పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు.

నదిని పరిరక్షించేందుకు కచ్చితమైన ప్రణాళిక, కఠిన నిబంధనలు రూపొందించాలని నేషనల్‌ గంగా శుద్ధి కౌన్సిల్‌ ని ఎన్జీటీ ఆదేశించడం గమనార్హం. గంగా శుద్ధి కౌన్సిల్ సభ్య కార్యదర్శికి ఎన్జీటీ చైర్‌ పర్సన్‌ జస్టిస్‌ ఆదేశ్‌ కుమార్‌ గోయల్‌ కీలక సూచనలు చేశారు. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ సమీక్షించి.. కచ్చితమైన, కఠిన నిబంధనలతో అక్టోబర్‌ 14 నాటికి యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేయాలని ఆదేశించారు.

First Published:  25 July 2022 8:32 AM GMT
Next Story