Telugu Global
National

క్రిస్టియన్, ముస్లింలుగా కన్వర్ట్ అయిన ఎస్సీలపై అధ్యయనానికి జాతీయ కమిషన్

క్రిస్టియన్, ముస్లింలుగా కన్వర్ట్ అయిన దళితులను ఎస్సీల లిస్టులో చేర్చడంలో కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత వైఖరితో పాటు.. వారికి ఎస్పీ బెనిఫిట్స్ అందించడంలో ఉన్న ఇబ్బందులను తెలియజేయాలని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది.

క్రిస్టియన్, ముస్లింలుగా కన్వర్ట్ అయిన ఎస్సీలపై అధ్యయనానికి జాతీయ కమిషన్
X

క్రిస్టియన్, ముస్లిం మతాల్లోకి కన్వర్ట్ అయిన దళితులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై త్వరలోనే సుప్రీం విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప మిగిలిన మతాల్లోకి కన్వర్ట్ అయిన ఎస్సీల (దళితుల) సామాజిక, ఆర్థిక, విద్యకు సంబంధించిన స్థితుగతులు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయడానికి జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తున్నది. హోం, లా, సోషల్ జస్టిస్ అండ్ ఎంప‌వ‌ర్‌మెంట్, ఫైనాన్స్ శాఖల నుంచి కూడా ఆమోదం లభించగానే జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఆయా శాఖల ఆమోదం లాంఛనప్రాయమేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

రాజ్యంగంలోని 341 ఆర్టికల్ (1950) ప్రకారం ఏ దళితుడు అయినా హిందూయిజం, బుద్దిజం, సిక్కిజం ఆచరిస్తే అతడిని ఎస్సీగా గుర్తించాలని, ఇతర మతాల్లోకి కన్వర్ట్ అయితే ఆ బెనిఫిట్స్ దక్కవు. వాస్తవానికి ఎస్సీలుగా తొలుత హిందువులను మాత్రమే గుర్తించారు. కానీ 1956లో చేసిన సవరణ ద్వారా సిక్కులను, 1990లో చేసిన సవరణ ద్వారా బౌద్ద మతం స్వీకరించిన దళితులను కూడా ఎస్సీల్లో చేర్చారు. ఎస్సీలుగా క్రిస్టియన్లు, ముస్లింలను కూడా చేర్చాలని వచ్చిన పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్‌ల బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆగస్టు 30న ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేస్తానని రాతపూర్వకంగా తెలియజేస్తానని, కొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు అక్టోబర్ 11కు ఈ పిటిషన్లు విచారిస్తామని చెప్పింది.

క్రిస్టియన్, ముస్లింలుగా కన్వర్ట్ అయిన దళితులను ఎస్సీల లిస్టులో చేర్చడంలో కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత వైఖరితో పాటు.. వారికి ఎస్పీ బెనిఫిట్స్ అందించడంలో ఉన్న ఇబ్బందులను తెలియజేయాలని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం మూడు వారాల గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలియజేసిన తర్వాత పిటిషనర్లు తమ రెస్పాన్స్ తెలియజేయడానికి మరో వారం గడువు ఇస్తామని పేర్కొన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో కేంద్రం జాతీయ కమిషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర మంత్రి నేతృత్వంలో ముగ్గురు లేదా నలుగురు సభ్యులతో ఈ కమిషన్ ఏర్పాటు కానున్నది. కాగా, ఇతర మాతాల్లోకి వెళ్లిన దళితుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి కనీసం ఒక ఏడాదైనా సమయం పడుతుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసే అవకాశం ఉన్నది.

కేంద్రం ఏర్పాటు చేసే జాతీయ కమిషన్ క్రిస్టియన్, ముస్లిం మతాల్లోకి కన్వర్ట్ అయిన వారి స్థితిగతులను అధ్యయనం చేయడమే కాకుండా.. ఎస్సీల జాబితాలోకి ఇంకా ఎవరినైనా చేర్చాలా అనే విషయంపై కూడా ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తున్నది. కేవలం దళితుల విషయంలోనే కులానికి, మతానికి లింక్ ఉన్నది. ఎస్టీలు లేదా ఓబీసీలు మతం మారినా వారి కులం విషయంలో ఎలాంటి మార్పు ఉండటం లేదు. ఎస్టీ జాబితాలో ఉన్న వ్యక్తులు ఏ మతానైనా స్వీకరించే వెసులుబాటు ఉందని డీవోపీటీ సైట్‌లో పేర్కొన్నారు. అలాగే మండల్ కమిషన్ రిపోర్టులో ఎంతో మంది ఓబీసీలు క్రిస్టియన్, ముస్లిం మతాలను ఆచరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అందిస్తుండగా.. ఎవరైనా మతం మారితే ఈ బెనిఫిట్స్ అందకుండా పోతున్నాయి.

2004లో యూపీఏ ప్రభుత్వం కూడా ఓ జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మతం, భాష ప్రాతిపదికన మైనార్టీలుగా గుర్తించబడిన వారి స్థితిగతులను అధ్యయనం చేయడానికి మాజీ సీజేఐ జస్టిస్ రంగనాథ్ మిశ్ర నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ 2007లో తమ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎస్సీలుగా గుర్తించడానికి మతాన్ని లింక్ చేయవద్దని అందులో ప్రతిపాదించింది. ఎస్టీలు ఎలాగైతే మత స్వేచ్ఛను పొందుతున్నారో అలాగే దళితులను కూడా ఉంచాలని పేర్కొన్నది. అయితే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను అంగీకరించలేదు. 2007లోనే నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ కూడా దళిత క్రైస్తవులు, దళిత ముస్లింల మీద ఓ అధ్యయనం చేసింది. వీళ్లకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని ఆ అధ్యయనంలో పేర్కొన్నది. అయితే, సర్వే చేసిన శాంపిల్స్ చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంటూ ఆ నివేదికను కూడా బుట్టదాఖలు చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి దళిత క్రిస్టియన్, ముస్లింలపై అధ్యయనానికి మరో కమిషన్‌ను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

First Published:  19 Sep 2022 2:06 AM GMT
Next Story