Telugu Global
National

నరేంద్ర మోడీ, అమిత్ షా విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు : మల్లికార్జున్ ఖర్గే

ఈ దేశం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రాణ త్యాగాలు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మోడి, అమిత్ షాలు స‌మాజాన్ని విభ‌జించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నార‌ని ఆయన‌ మండిప‌డ్డారు.

నరేంద్ర మోడీ, అమిత్ షా విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు : మల్లికార్జున్ ఖర్గే
X

ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లు దేశాన్ని, స‌మాజాన్ని విభ‌జించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే మండిప‌డ్డారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఏమైనా సహకరించారా అని ఖర్గే ప్రశ్నించారు. దేశం కోసం కాంగ్రెస్ నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. "అప్పుడు వాళ్ళు పుట్టలేదు. మహాత్మా గాంధీ వంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని కోసం పోరాడారు. దేశాన్ని ఏకం చేసినందుకు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తమ జీవితాలను త్యాగం చేశారు. దేశం కోసం మీరు చేసిన త్యాగం ఏమిటి? అంటూ మోడీ, అమిత్ షాల‌ను నిల‌దీశారు.

నేడు దేశంలో వాతావరణం క‌లుషిత‌మై క్షీణిస్తోందని, శాంతి, ఐక్యతతో దేశాన్ని మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అందుకే భారత్ జోడో యాత్ర కొనసాగుతోందని ఖ‌ర్గే అన్నారు. ''ఈ భారత్ జోడో యాత్ర దేశంలోని ప్రజల ఆలోచనలను ఏకం చేయడం కోసమే తప్ప వారిని విభజించడం కోసం కాదు'' అని అన్నారు.

కాంగ్రెస్ దేశాన్ని విభజించడం గురించి మాత్రమే మాట్లాడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. తాను వెళ్లిన ప్రతిచోటా విభజన గురించి మాట్లాడటం షాకు అలవాటని ఖర్గే అన్నారు. ఈ రోజు దేశం అభివృద్ధి చెందుతోంది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అని స్ప‌ష్టం చేశారు. "మేము దేశాన్ని ఏకం చేయడం, సమాజాన్ని ఏకం చేయడం, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం, దేశం ప్రజాస్వామ్య బ‌ద్దంగా పనిచేసేలా రాజ్యాంగాన్ని రక్షించడం గురించి మాట్లాడుతాము. మేము దానిని నమ్ముతాము . దాని కోసం మేము కృషి చేస్తున్నాము, "అని ఖ‌ర్గే చెప్పారు.

"ఈ 70 ఏళ్లలో ఏమీ చేయకపోతే, ఇన్ని ఎయిమ్స్ ఆస్ప‌త్రులు, ఇంత మంది డాక్టర్లు, ఇంజనీర్లు లేదా ఇంత ప్రభుత్వ రంగ సంస్థ‌లు, ప్ర‌భుత్వ పని ఉండేవా? వారు ఏమీ చేయరు, కానీ నినాదాలు చేయడం, ప్రజలను విభజించడం మాత్రమే వారి లక్ష్యంగా ప‌ని చేస్తున్నారు. కానీ, మేము దానిపై పోరాడుతూనే ఉంటాము, "అని కాంగ్రెస్ నాయకుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే అన్నారు.

అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై ...

పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. పార్టీ అధ్యక్ష పదవికి శశి థరూర్‌తో తాను పోటీ చేస్తానని, దేశం, పార్టీ అభివృద్ధి కోసం తమ అభిప్రాయాలను తెలియజేయడమే లక్ష్యంగా పోటీ చేస్తున్న‌మ‌ని అన్నారు.ఇది అంతర్గత ఎన్నికలు. ఇది ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల మ‌ధ్య జ‌రుగుతున్న పోటీయే త‌ప్ప మ‌రోటికాదు. వారు గొడవ పడకుండా, వారి అభిప్రాయాలను తెలియ‌జేస్తూ, ఒకరినొకరు ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారు, "అని ఖ‌ర్గే చెప్పాడు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైతే ఫలానా అభ్యర్థి ఏం చేస్తారనేది ఎన్నికల ప్రచారం కాదని, అందరూ కలిసి ఏం చేయగలరనేదే ముఖ్యం అని ఖర్గే అన్నారు.

"నా నమ్మకం ఏమిటంటే... నేనేం చేస్తాను అనేది ప్రశ్న కాదు. దేశం కోసం, పార్టీ కోసం మేమిద్దరం కలిసి ఏం చేస్తామన్నది ప్రశ్న, ఇది ముఖ్యం'' అని ఆయన అన్నారు. మీరు (పార్టీ కార్యకర్తలు) నేను కలిసి పార్టీని ఎలా బలోపేతం చేస్తాం, దేశ రాజ్యాంగాన్ని, దాని ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతాము, అనేది ప్రశ్న అని ఖర్గే అన్నారు.

తాను ఎన్నికైతే పార్టీ ఉదయ్‌పూర్ ప్రకటనను అమలు చేస్తానని 80 ఏళ్ల ఖర్గే చెప్పారు. "నాకు అవకాశం దొరికితే, ఉదయపూర్ డిక్లరేషన్‌ను పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మీరు చర్చల తర్వాత ప్రకటన చేసారు .పార్టీ, దేశం ముందు కొన్ని విషయాలు ఉంచారు. నేను దానిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని నాతో పాటు క‌లిపి ముందుకు తీసుకువెళతాను, "అని చెప్పారు. "అందరినీ వెంట తీసుకెళ్లడం ముఖ్యం. నేను అందరి సలహాలు తీసుకుంటాను. పిసిసిలు, ఇతరులతో చర్చించి సమస్యలకు పరిష్కారాలను కనుగొంటాను, ఇది సమష్టి నాయకత్వం అని ఆయన అన్నారు.

First Published:  10 Oct 2022 9:29 AM GMT
Next Story