Telugu Global
National

పసిబిడ్డతో అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే

సరోజ్ అహిరే గత సెప్టెంబర్ 30న ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు రెండున్నర నెలల పసికందుతో సరోజ్ అహిరే వచ్చారు.

పసిబిడ్డతో అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే
X

అతి ముఖ్యమైన సమయంలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌కు కొందరు సభ్యులు గైర్హాజరవుతుంటారు. అలాంటి నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఓ మహిళా ఎమ్మెల్యే రెండున్నర నెలల పసికందుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ సంఘటన చోటు చేసుకోగా.. బాలింత అయి ఉండి కూడా బాధ్యతగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆ మహిళా ఎమ్మెల్యేను సహచర ఎమ్మెల్యేలు అభినందించారు.

నాగపూర్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే సరోజ్ బాబూలాల్ అహిరే నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకురాలు. ఈమె డియోలలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సరోజ్ అహిరే గత సెప్టెంబర్ 30న ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు రెండున్నర నెలల పసికందుతో సరోజ్ అహిరే వచ్చారు.

బాలింత అయి ఉండి పసికందుతో అసెంబ్లీకి హాజరు కావడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సరోజ్ అహిరే బదులిస్తూ..' కరోనా వల్ల రెండున్నర సంవత్సరాలుగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందుకే బాలింతను అయినప్పటికీ సమావేశాలకు హాజరయ్యాను. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కరోనా కారణంగా అసెంబ్లీకి హాజరు కాలేకపోయాను. ఇప్పుడు కూడా అసెంబ్లీకి హాజరు కాకుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పగలను. అందువల్లే కష్టం అయినప్పటికీ పసికందుతో సమావేశాలకు హాజరు అయ్యాను.' అని సరోజ్ అహిరే పేర్కొన్నారు. బాలింత అయి ఉండి ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా పసికందుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మహిళా ఎమ్మెల్యేను సహచర ఎమ్మెల్యేలు అభినందించారు.

First Published:  19 Dec 2022 11:07 AM GMT
Next Story