Telugu Global
National

ముస్లిం విద్యార్థిని కొట్టించిన ఘటనలో.. స్కూల్ గుర్తింపు రద్దు

అసలు మతం అంటే కూడా తెలియని చిన్నారుల్లో అనవసరమైన జాడ్యాన్ని నూరిపోసే సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. టీచర్ ఆదేశంతో కొందరు విద్యార్థులు ఆ బాలుడి చెంపపై పదేపదే కొట్టారు.

ముస్లిం విద్యార్థిని కొట్టించిన ఘటనలో.. స్కూల్ గుర్తింపు రద్దు
X

ముస్లిం విద్యార్థి చెంపపై కొట్టాలని తోటి విద్యార్థులను ప్రోత్సహించిన సంఘటన నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఓ స్కూల్‌ గుర్తింపు రద్దు చేశారు. ఎక్కాలు అప్పజెప్పలేదన్న కారణంతో ముజఫర్‌నగర్‌లో ఉన్న నేహా పబ్లిక్ స్కూల్ టీచర్, తోటి విద్యార్థులతో ముస్లిం బాలుడిని కొట్టించింది. అంతేకాకుండా గట్టిగా కొట్టాలంటూ దగ్గరుండి ప్రోత్సహించింది.

అసలు మతం అంటే కూడా తెలియని చిన్నారుల్లో అనవసరమైన జాడ్యాన్ని నూరిపోసే సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. టీచర్ ఆదేశంతో కొందరు విద్యార్థులు ఆ బాలుడి చెంపపై పదేపదే కొట్టారు.


ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించి కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో స్కూల్‌ని బంద్ చేయాలని యోగి సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే విద్యాశాఖ స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు పంపింది. అలాగే ఆ పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా వారిని సమీపంలోని స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వాలంటూ ఆదేశించారు.

మరోవైపు స్కూల్‌ ప్రిన్సిపల్‌ అయిన ఆ ఉపాధ్యాయురాలు తన చర్యను గట్టిగా సమర్థించుకుంది. ముస్లిం విద్యార్థులు సరిగా చదవడం లేదని వారి తల్లులు ఫిర్యాదు చేశారని, వారికి చదువు రావాలన్న ఉద్దేశంతో ఇలా చేశానని చెప్పింది. తాను దివ్యాంగురాలిని కాబట్టి లేవలేక తోటి విద్యార్థుల‌తో కొట్టించానని చెప్పింది. ఇందులో ఎలాంటి దురాభిప్రాయం లేదని వెల్లడించింది. అయితే బాలుడి తండ్రి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇచ్చారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు.


First Published:  28 Aug 2023 6:19 AM GMT
Next Story