Telugu Global
National

రేపిస్టుల విడుదల తర్వాత భయంతో గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయిన ముస్లింలు

గుజరాత్ ప్రభుత్వం 11 మంది రేపిస్టులను జైలు నుంచి విడుదల చేశాక వారి గ్రామంలో నివసించే ముస్లింలు భయంతో వణికి పోయారు. వారంతా గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయారు.

రేపిస్టుల విడుదల తర్వాత భయంతో గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయిన ముస్లింలు
X

అది గుజరాత్ లోని రంధిక్‌పూర్ గ్రామం...ఆగస్టు 16వ తేదీ... ఆ గ్రామంలో నివసించే దాదాపు300 మంది ముస్లిం కుటుంబాల్లో ఓ వార్త గుప్పుమంది.... ఇంతలోనే డప్పులు, డోళ్ళు...పాటలూ , హడావుడి వినిపించింది..... బిగ్గరగా నినాదాలు వినిపించాయి....ముస్లింలంతా ఇళ్ళల్లోనే బిగుసుక పోయారు... భయంతో వణికి పోయారు... వాళ్ళు అంతలా భయపడటానికి కారణమైన వార్త ఏంటంటే... అదే గ్రామంలో 2002 లో బిల్కిస్ బానో అనే గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి, అనేక మందిని హత్య చేసిన 11 మంది రేపిస్టులు, హంతకులు జైలు నుంచి విడుదలై ఇళ్ళకొచ్చారు. ఇళ్ళకొచ్చి వాళ్ళు మామూలుగా ఉండలేదు. వాళ్ళు చేసి ప‌నుల గురించి ఏ మాత్రం పశ్చాత్తాప పడకుండా గొప్పలు చెప్పుకున్నారు. హిందుత్వ గ్రూపులు వాళ్ళకు సన్మానాలు చేశాయి. ఊర్లో వాళ్ళకు ఘనంగా స్వాగతం పలుకుతూ సంగీత కచేరీలయ్యాయి.పటాసులు పేల్చారు.

ఈ వాతావరణం అక్కడ నివసిస్తున్న ముస్లింలకు 2002 ను గుర్తు చేసింది. తమ పిల్లలకు, తమకు మళ్ళీ ఏం జరుగుతుందో అని భయపడి పోయారు.

ఆ రాత్రి నుంచే ఒక్కొక్క ముస్లిం కుటుంబం తమ ఇళ్ళను ఖాళీ చేసి గ్రామం నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు.

ఆగస్టు 16న అర్ధరాత్రి, హమీద్ హడావుడిగా తన పిల్లలను, భార్యను గాఢనిద్ర నుండి లేపాడు. కుటుంబమంతా కలిసి నిశ్శబ్దంగా, కొన్ని బట్టలు, పిల్లల‌ పాఠ్యపుస్తకాలు, కొన్ని పాత్రలను ప్యాక్ చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్,కొంత నగదును తీసుకొని తెల్లవారుజామున 4 గంటలకు, వారు తమ ఇంటికి తాళం వేసి, 50 కిలోమీటర్ల దూరంలోని దేవ్‌గఢ్ బరియాలోని సహాయ శిబిరానికి బయలుదేరారు.

యూసుఫ్ అనే మరో వ్యక్తి తన భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి కట్టుబట్టలతో రంధిక్‌పూర్‌ను విడిచిపెట్టాడు. "ఆ 11 మంది ఖైదీలను విడుదల చేసిన మూడు రోజుల తర్వాత నేను గ్రామాన్ని విడిచిపెట్టాను. అల్లర్లు జరిగి 20 ఏళ్లు అయింది కదా, ఇక ఏమీ జరగకపోవచ్చని మొదట అనుకున్నాను. కానీ పరిస్థితులు మారుతున్నాయి…" అన్నాడు యూసుఫ్

"నాకు నలుగురు ఆడపిల్లలు. వేడుకలు చేస్తూ, సంగీతంతో, బాణసంచాతో ఆ 11 మంది ఖైదీలను స్వాగతించిన తీరు చూసి, నాకు నిద్ర పట్టలేదు. వాళ్లు నా కూతుళ్లకు ఏదైనా హాని తలపెడితే ఏంటి పరిస్థితి అనినన్ను నేను ప్రశ్నించుకున్నాను," అని అయూసుఫ్ చెప్పాడు.

2002లో అతని గ్రామంలో హింస చెలరేగినప్పుడు యూసుఫ్ వయస్సు 14 సంవత్సరాలు. "అప్పట్లో, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగడం గురించి మేము విన్నాము.కానీ మావూరిలో కూడా హింస జరుగుతుందని మేము ఊహించలేదు" అని అతను చెప్పాడు.

2002లో యూసుఫ్, దాడులనుంచి తప్పించుకొని ఊరి పక్కనే ఉన్న అడవిలో తలదాచుకోవడంతో ప్రాణాలతో బైటపడ్డాడు. "నేను గోద్రాలోని సహాయ శిబిరానికి చేరుకోవడానికి ముందు కనీసం ఒక నెలపాటు అడవిలోనే ఉన్నాను" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

"బిల్కిస్ నా పొరుగునే ఉండేది. వారు ఆమెపై చేసిన దుర్మార్గం గురించి ఆలోచిస్తే నా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒక గుంపు మా ఇళ్లను తగలబెట్టడం, మా వాళ్ళను హత్య చేయడం నేను నాకళ్ళతో చూశాను. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారో అని భయంతో ఉన్నాము" అన్నాడు.

ఆగస్ట్ 20 మధ్యాహ్నం, ఇక్బాల్ , అతని భార్య, వారి నలుగురు పిల్లలు రంధిక్‌పూర్ నుండి ఒక టెంపోలో వాళ్ళ వస్తువులన్నింటినీ ఎక్కించుకొని గంట తర్వాత దేవ్‌గఢ్ బరియాలోని సహాయ శిబిరానికి చేరుకున్నారు.

"నాకు స్కూల్‌కి వెళ్లే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు రంధిక్‌పూర్ సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. మేము ఇలా వచ్చేయడం వారి చదువుపై ప్రభావం చూపుతోంది. అయితే వారి ప్రాణాల కంటే చదువు ముఖ్యమా?" అని ఇక్బాల్ అడిగాడు.

ఇక్బాల్ కుటుంబం 2002 అల్లర్ల తర్వాత రంధిక్‌పూర్ నుండి పారిపోయింది. వారు 2004లో గ్రామానికి తిరిగి వచ్చారు. "గ్రామంలో మా పూర్వీకుల ఇల్లు ఉంది. పరిస్థితి సాధారణంగా ఉందని భావించిన తర్వాత, మేము తిరిగి వచ్చాము, "అని అతను చెప్పాడు. అయితే, ఈసారి, ఇక్బాల్ కు ఇంటికి తిరిగి వచ్చే ఆలోచన లేదు. కనీసం ఆ 11 మంది మళ్ళీ జైలుకు వెళ్తే తప్ప తాము ఇంటికి తిరిగి రాలేము అని ఇక్బాల్ అన్నాడు.

"దేవ్‌గర్ బరియాలోని సహాయ శిబిరంలో మాకు ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు. మా పొరుగువారు మాకు ఆహారం ఇస్తున్నారు. ఇలా ఎంతకాలం కొనసాగుతుంది? ఏదైనా పని చేద్దామన్నా పని లేదు. అయినా కానీ ఆ 11 మంది వ్యక్తులు అక్కడ ఉన్నంత వరకు మేము రంధిక్‌పూర్‌కు తిరిగి రావడం అసాధ్యం. "అని అతను చెప్పాడు.

ఇప్పుడు రంధిక్‌పూర్ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబమూ లేదు. చాలా మంది దేవ్‌గర్ బరియాలోని సహాయ శిబిరానికి వెళ్ళిపోయారు. మరి కొందరు బంధువుల ఇళ్ళల్లో తలదాచుకుంటున్నారు. వాళ్ళక్కడ అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అయినా సరే ఆ 11 మంది రేపిస్టులు తిరిగి జైలుకు వెళ్ళనంత కాలం తాము గ్రామానికి వెళ్ళబోమని తేల్చి చెప్తున్నారు.

Next Story