Telugu Global
National

సోషల్ మీడియాలో అసభ్యంగా పోజు.. నటుడు రణవీర్ సింగ్ పై పోలీసుల కేసు

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పై ముంబైలో కేసు నమోదయ్యింది. తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో ప్రదర్శించినందుకు గాను పలువురు ఆయనపై పోలీసులకు పిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో అసభ్యంగా పోజు.. నటుడు రణవీర్ సింగ్ పై పోలీసుల కేసు
X

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను షేర్ చేసి చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఆయనపై ముంబై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. రణవీర్ సింగ్ తన హేయమైన చర్య ద్వారా మహిళల సెంటిమెంట్లను గాయపరిచాడని, వారిని అవమానపరిచాడని ఓ ఎన్జీఓ (స్వచ్చంద సంస్థ) ఇచ్చిన ఫిర్యాదుతో చెంబూరు పోలీసులు .. భారత శిక్షా స్మృతితో బాటు ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ సంస్థ ప్రతినిధితో బాటు ఓ మహిళా లాయర్ కూడా తూర్పు ముంబై శివార్లలోని పోలీసు స్టేషన్ లో వేరుగా ఫిర్యాదు దాఖలు చేశారు. మహిళలను అగౌరవపరిచే విధంగా రణవీర్ సింగ్ ఫోటో షూట్ ఉందని, అతని అసభ్య, అశ్లీల చర్యకు గాను అతనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదుల్లో కోరారు. బర్ట్ రీనాల్డ్స్ అనే అమెరికన్ నటుడికి ట్రిబ్యూట్ గా తానీ నిర్ణయం తీసుకున్నానని రణవీర్ సింగ్ ఓ ఇంటర్ వ్యూలో పేర్కొన్నాడు. ఓ పేపర్ మ్యాగజైన్ కి తానిలా ఫోటో షూట్ ఇవ్వడం తప్పేమీ కాదని తనను తాను సమర్థించుకున్నాడు. 2014 లో మొదటిసారిగా అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ చాంపేన్ ఫోటోను ముఖచిత్రంగా ప్రచురించి ఇదే పేపర్ మ్యాగజైన్.... వివాదాలకు తెర తీసింది. కాగా సోషల్ మీడియాలో రణవీర్ చర్యను అనేకమంది ఖండించగా మరికొందరు ఇందులో తప్పేమీ లేదన్నట్టు సమర్థించారు. ఇంటర్నెట్ ని ఇతని ఫోటోలు షేక్ చేశాయని కొందరు జోకింగ్ గా మీమ్ లను పోస్ట్ చేశారు. పైగా టీవీ నటుడు కరణ్ వీర్ మెహ్రా కూడా ఇతనిలాగే నగ్న ఫోజులతో ఓ ఫోటో షూట్లో పాల్గొని .. వాటిని తన ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.మరోవైపు- ఢిల్లీకి చెందిన ఓ లాయర్ సైతం రణవీర్ చర్యను ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఏం చేశారంటే ?

రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కొందరు విచిత్ర నిరసనకు దిగారు. రణవీర్ ఫొటోతో కూడిన ఓ బాక్సులో వారు తాము సేకరించిన దుస్తులను వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. పైగా; 'మానసిక దౌర్బల్యం' అన్న ట్యాగ్ లైన్ తో ఓ క్లిప్ ని ప్రదర్శించారు. దుస్తుల విరాళానికి మాకు సహకరించండి అని వీరిలో కొంతమంది కోరారు.




First Published:  26 July 2022 2:17 PM GMT
Next Story