Telugu Global
National

భారీ నష్టాల్లో ముంబై మోనో రైల్..

రోజుకి లక్షమంది ప్రయాణికులు మోనో నెట్ వర్క్ ని ఉపయోగించుకుంటారని సీఎంగా ఉన్నప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గొప్పగా చెప్పారు. కానీ కొవిడ్ కి ముందు కేవలం 18వేలమంది మాత్రమే దీన్ని ఉపయోగించుకున్నారు. ఈ ఏడాది రోజువారీ ప్రయాణికుల సంఖ్య 12వేలకు పరిమితమైంది.

భారీ నష్టాల్లో ముంబై మోనో రైల్..
X

ముంబైలో ప్రయాణికులకు కొత్త అనుభూతిని మిగిల్చేందుకు తెరపైకి తీసుకొచ్చిన మోనో రైల్ వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంటోంది. ఓ విఫల ప్రయోగంలా నిలిచింది. మహారాష్ట్రకు అదో తెల్ల ఏనుగులా మారింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 280 కోట్ల రూపాయల నష్టం రాగా.. ఈ ఆర్థిక సంవత్సరం 529 కోట్ల రూపాయల నష్టాన్ని ముందుగానే అంచనా వేశారు అధికారులు.

ఎందుకీ నష్టాలు..?

హైదరాబాద్ లాగే ముంబైలో మెట్రో వ్యవస్థ ఉంది. అయితే దానికి అదనంగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో మోనో రైల్ ని ఏర్పాటు చేశారు. ఇది సింగిల్ ట్రాక్ లో వెళ్తుంది. 20కిలోమీటర్ల మేర ఉన్న ఈ ట్రాక్ లో 17 స్టేషన్లు ఉన్నాయి. 2460 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో మోనో రైలుని ముంబైకి తీసుకొచ్చి అప్పటి ప్రభుత్వ అధినేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ రాను రాను ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి నష్టాలు పెరిగిపోయాయి. ఇప్పుడు నష్టాలు పూడ్చుకోలేని స్థాయికి చేరుకున్నాయి.

టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం కేవలం రూ.13.6 కోట్లు. అయితే దీని విస్తరణ పేరుతో జరిగిన అవినీతి కారణంగా పెట్టుబడి పెరిగిపోయి దానికి తగ్గ ఆదాయం లేకుండా పోయింది. దీంతో మోనో రైలు నష్టాలబారిన పడింది. గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తిగా చేతులెత్తేసింది. ఇప్పుడు బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. మోనో రైల్ ను మూసివేయాలని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ మాజీ అధికారులు నెత్తీనోరు మొత్తుకుని చెబుతున్నా ప్రభుత్వం సైలెంట్ గా ఉంది.

రోజుకి లక్షమంది ప్రయాణికులు మోనో నెట్ వర్క్ ని ఉపయోగించుకుంటారని సీఎంగా ఉన్నప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గొప్పగా చెప్పారు. కానీ కొవిడ్ కి ముందు కేవలం 18వేలమంది మాత్రమే దీన్ని ఉపయోగించుకున్నారు. ఈ ఏడాది రోజువారీ ప్రయాణికుల సంఖ్య 12వేలకు పరిమితమైంది. ఇక ముంబైలోని పలు మెట్రో మార్గాలు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. రెండు మార్గాల్లో నెలకు 23కోట్ల రూపాయల నష్టం వస్తోంది. నిర్వహణ భారం పెరగడం, ప్రయాణికులు ఆశించిన స్థాయిలో మెట్రోని ఉపయోగించుకోకపోవడంతో ముంబై మోనో రైల్ ప్రయోగం విఫలమైంది.

First Published:  19 Aug 2023 10:15 AM GMT
Next Story