Telugu Global
National

ముంబైలో ఘోరం.. సెల్‌ఫోన్ టార్చ్‌ వెలుగులో ప్ర‌స‌వం.. త‌ల్లీబిడ్డ మృతి

ఖస్రుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి ఇటీవల నిండు గర్భిణిగా ఉన్న తన భార్యను ముంబైలోని సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోంలో చేర్పించారు.

ముంబైలో ఘోరం.. సెల్‌ఫోన్ టార్చ్‌ వెలుగులో ప్ర‌స‌వం.. త‌ల్లీబిడ్డ మృతి
X

అత్యంత సామాన్యుడు కూడా ప్ర‌భుత్వాస్ప‌త్రిలో వైద్యం అంటే ఎందుకు వెళ్ల‌డో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌గా నిలిచిన ఘ‌ట‌న ఇది. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నిర్ల‌క్ష్యానికి, ప్ర‌భుత్వ వైద్యుల అల‌స‌త్వానికి రెండు నిండు ప్రాణాలు గాల్లో క‌లిసిపోయిన దారుణ ఘ‌ట‌న ఇది. చిమ్మ చీకట్లో సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులో సిజేరియన్ చేయ‌డంతో త‌ల్లీబిడ్డ ఇద్ద‌రూ చ‌నిపోయిన ఘోరం ముంబైలో చోటు చేసుకుంది.

ఖస్రుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి ఇటీవల నిండు గర్భిణిగా ఉన్న తన భార్యను ముంబైలోని సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోంలో చేర్పించారు. డెలివ‌రీ టైమ్‌ కరెంట్ పోయినా.. ఇతర ఏర్పాట్లు చేయకుండానే టార్చ్ లైట్ వేసి, వైద్యులు ఆపరేషన్ చేశారని, దాంతో తల్లీబిడ్డ మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. `ఆస్ప‌త్రికి తీసుకువచ్చేప్పుడు నా కోడలికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఏప్రిల్ 29న ఉదయం ఏడుగంటలకు డెలివరీ వార్డుకు తరలించారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంచారు. అంతా బాగానే ఉందని సాధార‌ణ ప్ర‌స‌వ‌మే అవుతుంద‌ని కూడా చెప్పారు. కానీ మేం చూడ‌టానికి వెళ్లేస‌రికి మా కోడ‌లు రక్తపు మడుగులో కనిపించింది` అని ఆమె అత్త గొల్లుమ‌న్నారు.

ఫిట్స్ వ‌చ్చింద‌ని, సిజేరియ‌న్ చేయాల‌న్నారు

ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో కొద్దిసేపటికి ఆమెకు ఫిట్స్ వచ్చాయని, వెంటనే సిజేరియ‌న్ చేయాల‌న్నారు. మా దగ్గర సంతకాలు చేయించుకున్నారు. అప్పుడే క‌రెంటు పోయింది. కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులో డెలివ‌రీ చేశారు. బిడ్డ చనిపోయిందని, తల్లికి ప్రమాదం లేదని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం సియోన్ ఆస్ప‌త్రికి వెళ్లమని సూచించారు. అప్పటికే నా కోడలు కూడా ప్రాణాలు కోల్పోయింది అని అన్సారీ తల్లి క‌న్నీరుమున్నీర‌య్యారు. ఆస్ప‌త్రిలో కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదని చెప్పారు.

ఓ ప్రాణం పోయినా మ‌రో సిజేరియ‌న్ చేశారు

దివ్యాంగుడైన అన్సారీకి ఏడాది కిందటే పెళ్ల‌య్యింది. ఇంత‌లోనే భార్య‌బిడ్డ‌ల్ని కోల్పోయాన‌ని అన్సారీ రోదిస్తున్నారు. తన జీవితాన్ని నాశనం చేసిన ఆస్ప‌త్రి సిబ్బందికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అన్సారీ భార్య డెలివరీ తర్వాత మరో గర్భిణికి కూడా అదే థియేటర్లో టార్చ్‌లైట్ వెలుగులోనే సిజేరియ‌న్ చేసిన దృశ్యాల‌ను వారు బ‌య‌ట‌పెట్టారు.

అత్యంత ధ‌నిక కార్పొరేష‌న్‌లో ఇలాంటి ప‌రిస్థితా?

బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ (బీఎంసీ) దేశంలోనే అత్యంత ధనిక స్థానిక సంస్థ.. దాని వార్షిక బ‌డ్జెట్ రూ.52 వేల కోట్లు. ఇందులో రూ.6,250 కోట్లు వైద్యారోగ్య విభాగానికి కేటాయించారు. అయినా జ‌న‌రేట‌ర్ లాంటి కనీస సదుపాయాలు అందక ఓ త‌ల్లీబిడ్డ చ‌నిపోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో బీఎంసీ విచారణకు ఆదేశించింది.

First Published:  3 May 2024 7:48 AM GMT
Next Story