Telugu Global
National

హోర్డింగ్‌ కూలి 14 మంది మృతి.. ముంబైలో ఘోరం

బిల్‌బోర్డు EGO మీడియాకు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. దాని యజమానితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ ఏరియాలో మొత్తం EGO మీడియా నాలుగు బిల్‌ బోర్డులు ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి సోమవారం సాయంత్రం కూలింది.

హోర్డింగ్‌ కూలి 14 మంది మృతి.. ముంబైలో ఘోరం
X

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి భారీ హోర్డింగ్ కూలిన ఘటనలో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.


ఎలా జరిగింది..!

ముంబైలోని ఘట్‌కోపర్‌ ఏరియాలోని పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా 100 అడుగుల భారీ బిల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం వీచిన భారీ గాలుల ధాటికి ఒక్కసారిగా బిల్‌ బోర్డు ఎదురుగా ఉన్న పెట్రోల్‌బంక్‌పై కుప్పకూలింది. దీంతో పెట్రోల్‌ బంకులో ఉన్న వారు బిల్‌బోర్డు కింద నలిగిపోయారు. బిల్‌బోర్డు కూలుతున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కాగా.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం కూలిన బిల్‌బోర్డు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు NDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ఈ బిల్‌బోర్డు EGO మీడియాకు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. దాని యజమానితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ ఏరియాలో మొత్తం EGO మీడియా నాలుగు బిల్‌ బోర్డులు ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి సోమవారం సాయంత్రం కూలింది. ఐతే హోర్డింగ్‌ల ఏర్పాటుకు బృహణ్‌ ముంబై కార్పొరేషన్‌ నుంచి ఇగో మీడియా NOC తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనపడుతోంది. దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో హోర్డింగ్‌లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం.. తర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారింది.

First Published:  14 May 2024 3:22 AM GMT
Next Story