Telugu Global
National

అది మృత్యు రహదారి.. ఈ ఏడాది 62 మంది మృతి..

ఈ ఏడాది ఇప్పటి వరకూ అక్కడ 262 యాక్సిడెంట్లు కాగా, ఆ ప్రమాదాల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 192మంది గాయపడ్డారు.

అది మృత్యు రహదారి.. ఈ ఏడాది 62 మంది మృతి..
X

ముంబై సమీపంలోని పాల్ఘర్. ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరిది. పాల్ఘర్ రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం మిస్త్రీనే కాదు, వందల మంది ప్రాణాలు మింగిన రహదారి అని తెలుస్తోంది. ముంబై - అహ్మదాబాద్ హైవేలో పాల్ఘర్ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని నివేదికలు చెబుతున్నాయి. 100 కిలోమీటర్ల పరిధిలో యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా జరిగాయి, జరుగుతున్నాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకూ అక్కడ 262 యాక్సిడెంట్లు జరుగగా, ఆ ప్రమాదాల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 192 మంది గాయపడ్డారు. ఆ 62 మంది లిస్ట్ లో సైరస్ మిస్త్రీ, ఆయనతోపాటు చనిపోయిన జహంగీర్ పండోలే కూడా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరిగాయని, ఇది మృత్యు రహదారి అంటున్నారు స్థానికులు. దానికి తగ్గట్టే గణాంకాలు కూడా ఈ రోడ్డు ఎలాంటిదో చెబుతున్నాయి.

సెప్టెంబర్ 4న పాల్ఘర్ వద్ద కారు ప్రమాదం జరిగింది. కారులో సైరస్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఆ సమయంలో మహిళా డాక్టర్ అనహిత పండోలే కారు నడుపుతున్నారు. ఓవర్ స్పీడ్ తో వచ్చిన కారు ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో డివైడర్‌ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారు ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో ముందు సీట్లలో ఉన్నవారు సేఫ్ అయ్యారు. వెనక కూర్చున్న ఇద్దరు కనీసం సీటు బెల్ట్ కూడా పెట్టుకోకపోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత వాహన భద్రత విషయంపై చాలా పెద్ద చర్చ నడిచింది. వెనకవైపు ఉన్నవారికి కూడా సీట్ బెల్ట్ తప్పనిసరి చేయాలంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వెనక సీట్లవారికి కూడా ఎయిర్ బెలూన్స్ ఉండాలనే నిబంధన తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఆ రోడ్డు పరిస్థితి కూడా అంతంత మాత్రమేననే కామెంట్లు వినపడుతున్నాయి. అందర్నీ మింగేస్తున్న ఆ రోడ్డు.. సైరస్ మిస్త్రీ ప్రమాదంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. గతంలో జరిగిన ప్రమాదాల లెక్క మరింత భయపెడుతోంది.

First Published:  18 Sep 2022 9:47 AM GMT
Next Story