Telugu Global
National

కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేను తరిమి తరిమి కొట్టిన జనం

ఆదివారం నాడు ఉదయం ముదిగెరె గ్రామంలోకి ప్రవేశించి ఓ ఏనుగు ఓ మహిళపై దాడి చేసి తొక్కి చంపేసింది. దీంతో అధికారుల ఉదాసీనతపై మండిపడ్డ గ్రామస్తులు నిరసనకు దిగారు.

కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేను తరిమి తరిమి కొట్టిన జనం
X

కర్నాటక అధికార బీజేపీ కి చెందిన ఎమ్మెల్యేపై ఓ గ్రామంలో ప్రజలు దాడి చేసి తరిమికొట్టారు. సకాలంలో పోలీసులు వచ్చి ఆయనను రక్షించారు.

చిక్కమగళూరు జిల్లా ముదిగెరెలోని కుందూరు సమీపంలోని అడవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పొలాలను నాశనం చేయడం, ప్రజలపై, పశువులపై దాడులు చేయడం చాలా కాలంగా సాగుతూ ఉంది. ప్రజలు ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా అధికారులు కానీ బీజేపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఎంపి కుమారస్వామి గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. దీనిపై చాలా కాలంగా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారంనాడు జరిగిన దారుణ సంఘటన వారిలో మరింత ఆగ్రహానికి గురిచేసింది.

ఆదివారం నాడు ఉదయం ముదిగెరె గ్రామంలోకి ప్రవేశించి ఓ ఏనుగు ఓ మహిళపై దాడి చేసి తొక్కి చంపేసింది. దీంతో అధికారుల ఉదాసీనతపై మండిపడ్డ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మహిళ భౌతిక కాయాన్ని రోడ్డు మీదే ఉంచి ధర్నా చేశారు. అయినా అటు వైపు ఒక్క అధికారి కూడా రాలేదు. ఆ సాయంత్రానికి స్థానిక ఎమ్మెల్యే కుమారస్వామి వచ్చారు.

అప్పటికే ఆగ్రహం మీద ఉన్న గ్రామస్తులకు ఎమ్మెల్యేను చూడగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంతో కాలంగా ఏనుగుల సమస్య‌పై చెప్తూ ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని, ఉదయం నుంచి ధర్నా చేస్తూ ఉంటే సాయంత్రం దాకా ఎందుకు రాలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దాంతో ఎమ్మెల్యే గ్రామస్తులపై మండిపడ్డాడు. పైగా పరుషపదజాలం ఉపయోగించి తిట్టాడు. దాంతో ఎమ్మెల్యేపై జనం తిరగబడ్డారు. ఆయనపై దాడికి దిగారు. తరిమి తరిమి కొట్టారు. ఈ దాడిలో ఆయన బట్టలు చిరిగిపోయాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను రక్షించి ఊరు దాటించారు.

ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి మాట్లాడుతూ.. మహిళను చంపిన ఏనుగు తనదేనని కొందరు దుష్ప్రచారం చేశారని అన్నారు. గ్రామంలోని కొందరు కావాలనే గ్రూపులుగా ఏర్పడి తనను కొట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

"కొందరు ఉద్దేశపూర్వకంగా గుంపులుగా ఏర్పడి నన్ను కొట్టడానికి కుట్ర పన్నారు. ఏనుగు నాదేనని పుకార్లు వ్యాప్తి చేసి నన్ను కొట్టారు. నేను ప్రజల సమస్యలు వినకుండా పోలీసులు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేశారు.'' అని ఎమ్మెల్యే అన్నారు.

తమ సమస్యను పరిష్కరించాలంటూ అనేకరోజులుగా మొరపెట్టుకుంటున్నప్పటికీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని, ఆ విషయాన్ని ప్రశ్నిస్తే తమనే తిట్టాడని అందుకే తాము ఆగ్రహంతో దాడి చేయాల్సి వచ్చిందని గ్రాస్తులు అంటున్నారు.

First Published:  21 Nov 2022 9:01 AM GMT
Next Story