Telugu Global
National

రూ.15కోట్లకు ముంచేశారు.. కోర్టు మెట్లెక్కిన ధోనీ

తన వాటా కోసం పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించారు. అయినా స్పందన లేకపోవడంతో తాజాగా కోర్టు మెట్లెక్కారు ధోనీ.

రూ.15కోట్లకు ముంచేశారు.. కోర్టు మెట్లెక్కిన ధోనీ
X

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కోర్టు మెట్లెక్కారు. తనని రూ.15కోట్లకు ముంచేశారంటూ ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ సంస్థపై రాంచీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు న్యాయం చేయాలని, సదరు సంస్థనుంచి పరిహారం ఇప్పించాలన్నారు.

అసలేం జరిగింది..?

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు.. ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్ లిమిటెడ్‌ సంస్థ 2017లో ఎం.ఎస్.ధోనీతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆ కంపెనీకి ధోనీ ప్రచార కర్తగా ఉంటారు. దానికి ప్రతిఫలంగా ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను వారు ధోనీకి చెల్లిస్తారు. ధోనీ బ్రాండ్ తో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తే ఫీజులు కుమ్మేసుకోవచ్చని అనుకున్నారు నిర్వాహకులు. ధోనీ పేరు చెప్పగానే అకాడమీల్లో చేరేందుకు చాలామంది ఉత్సాహం చూపించారు. ఆర్కా స్పోర్ట్స్ లాభాలను కళ్లజూసింది. అయితే ధోనీకి ఇవ్వాల్సిన వాటాలో వారు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో వ్యవహారం రచ్చకెక్కింది.

ఆర్కా స్పోర్ట్స్‌ ప్రతినిధులతో పలుమార్లు ధోనీ చర్చలు జరిపారు. కానీ ఫలితం లేదు. డబ్బులివ్వకపోవడంతో ధోనీ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత తన వాటా కోసం పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించారు. అయినా స్పందన లేకపోవడంతో తాజాగా కోర్టు మెట్లెక్కారు ధోనీ. ఆర్కా స్పోర్ట్స్‌ చేసిన మోసం కారణంగా తనకు రూ.15కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారాయన.

First Published:  5 Jan 2024 12:35 PM GMT
Next Story