Telugu Global
Andhra Pradesh

పాకిస్థాన్ ఎన్నికల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. విజ‌య‌సాయిరెడ్డి సెటైర్

విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కి సోషల్ మీడియా వేదికగా మిశ్రమ స్పందన వస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ స్థితిగతులు మార్చిన ఒక పార్టీని పాకిస్థాన్‌తో పోల్చడం తగదని కొందరు విమర్శించారు.

పాకిస్థాన్ ఎన్నికల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. విజ‌య‌సాయిరెడ్డి సెటైర్
X

ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రసాభాస సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా తాను ఉండనని రాహుల్ గాంధీ స్పష్టం చేస్తుండగా.. ఆ స్థానంలో మరొకరిని ఎంపిక చేయలేక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేసి సచిన్ పైలెట్‌ను రాజస్థాన్ సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావించడంతో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించి మరొకరిని ఎంపిక చేసే పనిలో పడ్డారు పార్టీ అధిష్టానం పెద్దలు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.

'కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు సరిగ్గా పాకిస్థాన్ ఎన్నికల్లాగా కనిపిస్తున్నాయి. అంతిమంగా జనరల్ ఆశీర్వాదం పొందిన వ్యక్తే అధినేతగా వ్యవహరిస్తారు.' అని ట్వీట్ చేశారు. కాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కి సోషల్ మీడియా వేదికగా మిశ్రమ స్పందన వస్తోంది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ స్థితిగతులు మార్చిన ఒక పార్టీని పాకిస్థాన్‌తో పోల్చడం తగదని కొందరు విమర్శించారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకున్నారు.. దానిని ఈసీ కూడా తిరస్కరించింది..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంటే అందులో తప్పేమీ కనిపిస్తోందని.. మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

First Published:  30 Sep 2022 7:47 AM GMT
Next Story