Telugu Global
National

కాంగ్రెస్ చేసిన తప్పుకి నాకు నలుగురు పిల్లలు.. బీజేపీ ఎంపీ

నలుగురు పిల్లలు ఉండటం తన తప్పు కాదని, అది కాంగ్రెస్ తప్పేనని అన్నారు. కాంగ్రెస్ అప్పట్లోనే ఈ చట్టం చేసి ఉంటే తనకు నలుగురు పిల్లలు పుట్టి ఉండేవారు కాదన్నారు రవి కిషన్.

కాంగ్రెస్ చేసిన తప్పుకి నాకు నలుగురు పిల్లలు.. బీజేపీ ఎంపీ
X

పెట్రోల్ రేట్లు ఎందుకింతలా పెరిగాయి..? అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి..

నిత్యావసరాల రేట్లు ఎందుకిలా పెరుగుతున్నాయి..? అప్పట్లో కాంగ్రెస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల

ఆర్థిక వ్యవస్థ ఎందుకింత పతనం అవుతోంది..? అప్పట్లో కాంగ్రెస్ పాలన సరిగా లేదు కాబట్టి..

మీకు నలుగురు పిల్లలు కదా, కుటుంబ నియంత్రణ ఎందుకు పాటించలేదు..? అప్పట్లో కాంగ్రెస్ ఆ చట్టం తేలేదు కాబట్టి

చివరికిలా తయారయ్యారు బీజేపీ నేతలు. తమ అసమర్థతను కప్పి పుచ్చుకోడానికి ప్రతిసారీ కాంగ్రెస్ పై నిందలు వేస్తూ సర్దిచెప్పుకుంటున్న బీజేపీ నేతలు, తాజాగా పిల్లల విషయంలో కూడా కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం, అత్యంత దారుణం. బీజేపీ ఎంపీ రవి కిషన్ సరదాగా ఈ వ్యాఖ్యలు చేసినా, కాంగ్రెస్ ని ఉద్దేశపూర్వకంగా బీజేపీ ఎలా కార్నర్ చేస్తుందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోటి లేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జనాభా నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఉంటే, తనకు నలుగురు పిల్లలు పుట్టి ఉండేవారు కాదని రవి కిషన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

శుక్రవారం లోక్ సభలో బీజేపీ ఎంపీలు రవి కిషన్, నిషికాంత్ దూబే.. పాపులేషన్ కంట్రోల్ బిల్ ని ప్రైవేట్ మెంబర్స్ బిల్ రూపంలో ప్రవేశ పెట్టారు. గతంలో రవికిషన్ ఈ ప్రైవేట్ బిల్ తీసుకొస్తారనే చర్చ వచ్చినప్పుడు.. నలుగురు పిల్లల తండ్రి ఈ బిల్లుపై ఏం మాట్లాడతారంటూ విమర్శలు వినిపించాయి. వాటికి ఇప్పుడు రవికిషన్ కౌంటర్ ఇచ్చారు. నలుగురు పిల్లలు ఉండటం తన తప్పు కాదని, అది కాంగ్రెస్ తప్పేనని అన్నారు. కాంగ్రెస్ అప్పట్లోనే ఈ చట్టం చేసి ఉంటే తనకు నలుగురు పిల్లలు పుట్టి ఉండేవారు కాదన్నారు రవి కిషన్.

ఆ విషయంలో చైనా గ్రేట్..

అయితే బీజేపీ ఎంపీ రవికిషన్ చైనాను మెచ్చుకోవడం మాత్రం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. జనాభా నియంత్రణ విషయంలో చైనా నిర్ణయాలను స్వాగతించారు రవి కిషన్. చైనా లాగా మన దేశంలో గత ప్రభుత్వాలు ఆలోచించి ఉంటే తరతరాల వారికి కష్టాలు ఉండేవి కావన్నారు.

జనాభా లెక్కలు ఎలా ఉన్నాయి..?

వాస్తవానికి భారత్ లో 1950లలో 5.9 శాతంగా ఉన్న టోటల్ ఫెర్టిలిటీ రేటు ఇప్పుడు 2.2కి దిగొచ్చింది. అంటే 1950 రోజుల్లో ఒక మహిళకు సగటున 5.9మంది పిల్లలు ఉండగా, ఇప్పుడు కేవలం 2.2మంది మాత్రమే సంతానంగా ఉన్నారు. ఇది కూడా ఇప్పుడు ఎక్కువే అన్నట్టుగా మారింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం వచ్చే ఏడాదినాటికి జనాభాలో భారత్, చైనాను మించిపోయే అవకాశముంది.

First Published:  10 Dec 2022 3:18 AM GMT
Next Story