Telugu Global
National

దేశంలో విద్వేషం.. బీజేపీపై అసదుద్దీన్ ధ్వజం

బీజేపీ నేతలు పదే పదే వల్లె వేస్తున్న క్విట్ ఇండియా నినాదాన్ని యూసుఫ్ మెహర్ అనే ముస్లిం తొలిసారిగా తెరపైకి తెచ్చారని చెప్పారు అసదుద్దీన్ ఒవైసీ. అది ముస్లిం ఇచ్చిన నినాదం అని తెలిస్తే బీజేపీ నేతలు క్విట్ ఇండియా అనడం మానేస్తారా అని ప్రశ్నించారు.

దేశంలో విద్వేషం.. బీజేపీపై అసదుద్దీన్ ధ్వజం
X

పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం వీగిపోయినా.. బీజేపీ ప్రభుత్వం చేసిన, చేస్తున్న తప్పుల్ని ప్రతిపక్షాలు సభా వేదికగా ఎండగట్టాయి. దేశంలో విద్వేషం నింపుతున్నారని మండిపడ్డారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఇలాంటి రాజకీయాలు దేశానికి చేటు చేస్తాయన్నారాయన. మణిపూర్, హర్యానాలో జరుగుతున్న హింసాకాండకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలన్నారు. మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడంలేదని, దీనికి కేంద్రం తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. దేశాన్ని పాలించే చౌకీదార్ మారిపోతారని, దుకాణం మూసేసుకోవాల్సిందేనని చెప్పారు.

నుహ్ లో జరిగిన హింస, యూసీసీ, హిజాబ్, మణిిపూర్ అల్లర్లపై అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల పట్ల కొంతమమంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీ మనస్సాక్షి ఎక్కడికి పోయిందని నిలదీశారు. అక్కడి ముఖ్యమంత్రి సహకరిస్తున్నారు కాబట్టి ఆయన్ను తొలగించడం బీజేపీ అధిష్టానానికి ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. హర్యానాలోని నూహ్‌ లో ముస్లింలకు చెందిన 750 భవనాలను అక్రమంగా కూల్చి వేశారని మండిపడ్డారు. వాటిని కూల్చేస్తున్నప్పుడు దేశం మనస్సాక్షి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

క్విట్ ఇండియా నినాదం ఎవరిదో తెలుసా..?

బీజేపీ నేతలు పదే పదే వల్లె వేస్తున్న క్విట్ ఇండియా నినాదాన్ని యూసుఫ్ మెహర్ అనే ముస్లిం తొలిసారిగా తెరపైకి తెచ్చారని చెప్పారు అసదుద్దీన్ ఒవైసీ. ఆ నినాదాన్ని తర్వాత మహాత్మా గాంధీ ఆమోదించారని అన్నారు. అది ముస్లిం ఇచ్చిన నినాదం అని తెలిస్తే బీజేపీ నేతలు క్విట్ ఇండియా అనడం మానేస్తారా అని ప్రశ్నించారు.

నియంత ఫార్ములా..

దేశంలో ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష అనేది నియంతల ఫార్ములా అని పేర్కొన్నారు అసదుద్దీన్ ఒవైసీ. దేశంలో లెక్కలేనన్ని భాషలు, అనేక మతాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఒకదేశం, ఒకేచట్టం అనే యూసీసీ ఫార్ములా ఏంటని ప్రశ్నించారు. సమస్య సరిహద్దుల్లో లేదని, ఢిల్లీలో ఉందని ప్రధాని కాకముందు చెప్పిన మోదీ, ఇప్పుడు చైనాకు సాగిలపడ్డారని ఎద్దేవా చేశారు. చైనా ఆక్రమణలపై మోదీ నోరు మెదపడం లేదని చెప్పారు. హిజాబ్ సాకుగా చూపించి ముస్లిం బాలికలను విద్యకు దూరం చేశారని మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ.

First Published:  11 Aug 2023 2:57 AM GMT
Next Story