Telugu Global
National

'సింగం' వంటి సినిమాలు చాలా ప్రమాదకరం : బాంబే హైకోర్టు జడ్జి గౌతమ్ పటేల్

ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ గౌతమ్ పటేల్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

సింగం వంటి సినిమాలు చాలా ప్రమాదకరం : బాంబే హైకోర్టు జడ్జి గౌతమ్ పటేల్
X

దేశంలో ప్రజలు సత్వర న్యాయం కోరుకుంటున్నారు. ఇన్‌స్టంట్ జస్టిస్ అనేది ఎక్కడా జరగదు. కానీ సినీ పరిశ్రమ తీసే కొన్ని సినిమాల కారణంగా ప్రజలు కూడా అలాగే జరగాలని భావిస్తున్నారు. న్యాయ ప్రక్రియతో సంబంధం లేకుండా సత్వర న్యాయాన్ని అందించే 'సింగం' వంటి పోలీసు సినిమాలు చాలా ప్రమాదరకం. అవి సమాజాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాల్లో పెట్టే దృశ్యాలు.. ప్రజలకు హానికరమైన సందేశాన్ని పంపుతాయని పేర్కొన్నారు.

ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ గౌతమ్ పటేల్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. న్యాయ ప్రక్రియ అనేది ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది. ఈ క్రమంలో జరిగే కాలయాపనపై ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ఇది సరికాదని జస్టిస్ గౌతమ్ పటేల్ వ్యాఖ్యానించారు. కోర్టులు తమ పని చేయలేదని భావించినప్పుడు.. పోలీసులు తీసుకునే చర్యలను స్వాగతిస్తున్నారు.

అత్యాచార కేసుల్లో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినప్పుడు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాల్లో హీరోల్లాగా పోలీసులు వ్యవహరిస్తే చప్పట్లు కొడుతున్నారు. ఆ సమయంలో న్యాయం జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. కానీ అక్కడ నిజంగా న్యాయం జరిగిందా? అని జడ్జి గౌతమ్ పటేల్ ప్రశ్నించారు.

సింగం సినిమాలో ఒక రాజకీయ నేతపై క్లైమ్యాక్స్‌లో పోలీసులు అందరూ తిరగబడతారు. అతడిని కొడతారు. దీంతో న్యాయం జరిగినట్లు సినిమాలో చూపెడతారు. నిజంగా అక్కడ న్యాయం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. న్యాయ ప్రక్రియ అనేది నిదానంగా జరుగుతుంది. ఇన్‌స్టంట్ జస్టిస్ అనేది ఎక్కడా ఉండదు. తాను ఉదహరించిన ఘటనల్లో వ్యక్తి స్వేచ్ఛ హరించుకొని పోయింది. న్యాయ ప్రక్రియలో వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదనే సూత్రం ఉంటుంది. అందుకే నిదానంగా ఈ ప్రక్రియ జరుగుతుందని గౌతమ్ పటేల్ చెప్పుకొచ్చారు.

First Published:  24 Sep 2023 4:46 AM GMT
Next Story