Telugu Global
National

రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి వికృతానందం

చీప్ ట్రిక్స్ తో తమను కించపరచాలని చూస్తున్నారని, అలాంటి వారికి సిగ్గులేదని, వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదన్నారు రెజ్లర్ సాక్షి మలిక్.

రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి వికృతానందం
X

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజే రెజ్లర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై కేసులు కూడా పెట్టారు. అది చాలదన్నట్టు సోషల్ మీడియాలో రెజ్లర్లను రెచ్చగొట్టేలా కొంతమంది పోస్టింగ్ లు పెట్టారు. పోలీస్ వ్యాన్ లో వెళ్తున్న మహిళా రెజ్లర్లు నవ్వుతూ సెల్ఫీలు దిగినట్టు కొన్ని ఫోటోలను లీక్ చేశారు. ఆ ఫొటోలన్నీ మార్ఫింగ్ అని, ఇలాంటి చీప్ ట్రిక్స్ తో తమను కించపరచాలని చూస్తున్నారని, అలాంటి వారికి సిగ్గులేదని, వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదన్నారు రెజ్లర్ సాక్షి మలిక్. తమపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. బజరంగ్ పూనియా, ఫోగట్ సిస్టర్స్ కూడా ఫేక్ ఫొటోల ప్రచారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.


లైంగిక వేధింపులకు గురయ్యామంటూ తాము ఫిర్యాదు చేస్తే బ్రిజ్ భూషణ్ పై కేసు పెట్టడానికి పోలీసులకు ఏడు రోజులు సమయం పట్టిందని, కానీ తమపై ఏడు గంటల్లోనే కేసు పెట్టారని మరో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు. 12మందిపై అక్రమ కేసులు పెట్టారని, తమని బెదిరించాలని చూస్తున్నారని చెప్పారు.

ఖాళీగా జంతర్ మంతర్..

38రోజులుగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిన్న పార్లమెంట్ వైపు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెజ్లర్లు చట్టాన్ని అతిక్రమించారని అందుకే వారిని అరెస్ట్ చేశామంటున్నారు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌. జంతర్ మంతర్ వద్ద తిరిగి నిరసనకు అనుమతిచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్‌ విధించారు. ఆందోళనకారులు, ఇతరులను లోపలికి అనుమతించట్లేదు.

రెజ్లర్ల అరెస్ట్ లను ఖండిస్తూ విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజే మన దేశప్రతిష్టను మట్టికరిపించే ప్రయత్నం చేశారని ఆరోపణ చేశారు విపక్ష నేతలు. రెజ్లర్లకు జరిగిన అవమానానికి బీజేపీ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందన్నారు.

First Published:  29 May 2023 7:56 AM GMT
Next Story