Telugu Global
National

50 దేశాలను చుట్టేసిన మంకీ పాక్స్..

ప్రస్తుతం కేరళలోని కొల్లంకు చెందిన వ్యక్తి మంకీ పాక్స్ తో బాధపడుతున్నాడు. యూఏఈలో అతను ఆ వ్యాధిని అంటించుకుని వచ్చాడు.

50 దేశాలను చుట్టేసిన మంకీ పాక్స్..
X

ప్రపంచ వ్యాప్తంగా తాజా సంచలనంగా మారిన మంకీపాక్స్ వైరస్ ఇప్పటి వరకు 50 దేశాలను చుట్టేసింది. అయితే ఒక్క మరణం కూడా దీనివల్ల నమోదు కాలేదు. అదొక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే మరణాలు లేకపోయినా మంకీపాక్స్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. ఒకే ఒక్క కేసు నమోదైన భారత్ కూడా ఈ వైరస్ దెబ్బకి హడలిపోతోంది. మంకీపాక్స్‌ కేసులను నిర్ధారించేందుకు దేశంలో 15 వైరస్ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ లాబొరేటరీలు సిద్ధంగా ఉన్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

కేంద్రం నూతన మార్గదర్శకాలు..

దేశంలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. తొలి కేసు కూడా విదేశాలనుంచి రావడంతో.. అంతర్జాతీయ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, అక్కడ అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా జంతువులకు దూరంగా ఉండాలని, జంతువుల ఆహార పదార్థాలను తాకే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. విదేశాల్లో ఉన్నప్పుడు చర్మ సంబంధ వ్యాధులు, జననేంద్రియ వ్యాధులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని సూచించింది. ఎలుకలు, ఉడతలు, కోతులు, చింపాజీలను నేరుగా తాకకూడదు. రోగులు ఉపయోగించిన దుస్తులు, పడక, ఇతర వస్తువులను ఉపయోగించకూడదని చెప్పింది.

విమానాశ్రయాల్లో అప్రమత్తం..

విదేశీ ప్రయాణాలపై నిఘా లేకపోవడం వల్లే గతంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిందనే అపవాదు ఉంది. అందుకే ఇప్పుడు విదేశీ ప్రయాణికులపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు అధికారులు. సహజంగానే కొవిడ్ ప్రొటోకాల్స్ అన్నిచోట్లా పాటిస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు మంకీపాక్స్ లక్షణాలున్నవారికోసం వెదుకులాట మొదలవుతోంది. చర్మ సంబంధిత వ్యాధులున్నవారు కనపడితే వెంటనే వారికి కొన్ని సాధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

లైంగిక చర్యల వల్లే మంకీపాక్స్ వ్యాపిస్తుందని ప్రస్తుతానికి నిపుణులు నిర్థారించినా. వారికి సన్నిహితంగా ఉన్నవారికి, కుటుంబ సభ్యులకు కూడా ఇది సులభంగా సోకే ప్రమాదం ఉందని తేలింది. అయితే వ్యాధి లక్షణాలున్నవారు ఆరోగ్యంగానే కనపడతారు కాబట్టి దీన్ని ఒకరినుంచి మరొకరికి వ్యాపించకుండా అరికట్టడం అసాధ్యం. అందుకే ఎవరికి వారు ముందు జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచిస్తోంది. ప్రస్తుతం కేరళలోని కొల్లంకు చెందిన వ్యక్తి మంకీ పాక్స్ తో బాధపడుతున్నాడు. యూఏఈలో అతను ఆ వ్యాధిని అంటించుకుని వచ్చాడు. అతని కుటుంబ సభ్యులు 13మందిని ప్రైమరీ కాంటాక్ట్స్ గా గుర్తించి క్వారంటైన్లో ఉంచారు.

First Published:  16 July 2022 2:35 AM GMT
Next Story