Telugu Global
National

అమెరికాలో మోదీ పర్యటన - బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

బీబీసీ రూపొందించిన ''ఇండియా : ది మోడీ క్వశ్చన్‌ '' డాక్యుమెంటరీని నేడు (జూన్‌ 20న) వాషింగ్టన్‌లో ప్రదర్శించేందుకు హక్కుల సంఘాలు సిద్ధమయ్యాయి.

అమెరికాలో మోదీ పర్యటన - బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన
X

అమెరికాలో మోదీ పర్యటన - బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐదు రోజుల పాటు ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టుల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కీల‌క‌ ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. భారత్​- అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేసే పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరగనున్నాయి. కాగా, ప్రధాని అమెరికా పర్యటన నేపథ్యంలో నరేంద్ర మోదీ పట్ల హక్కుల సంస్థలు నిరసన ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. బీబీసీ రూపొందించిన ''ఇండియా : ది మోడీ క్వశ్చన్‌ '' డాక్యుమెంటరీని నేడు (జూన్‌ 20న) వాషింగ్టన్‌లో ప్రదర్శించేందుకు హక్కుల సంఘాలు సిద్ధమయ్యాయి.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మోదీ అధ్యక్షత వహిస్తారు. జూన్​ 22న ఆయన వైట్​హౌజ్‌కు వెళ్తారు. వైట్​హౌజ్‌లో ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ మధ్య పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, డిఫెన్స్​రంగాల్లో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. బైడెన్‌తో సమావేశం అనంతరం అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అంశంగా చెప్పొచ్చు. అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించే తొలి భారతీయుడిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోనున్నారు. 2016లో బరాక్​ ఒబామా.. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో పర్యటించిన మోదీ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. జూన్​ 22 సాయంత్రం జో బైడెన్, ఆయన సతీమణి జిల్​ బైడెన్‌తో డిన్నర్‌లో పాల్గొంటారు. ఈ డిన్నర్‌లో దౌత్యాధికారులు, కాంగ్రెస్​ సభ్యులు పాల్గొంటారు.

జూన్​ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్, విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌ను కలుస్తారు. అనంతరం వివిధ కంపెనీల సీఈఓలతో మోదీ సమావేశం అవుతారు. అదేరోజు సాయంత్రం రోనాల్డ్​ రీగన్​ సెంటర్‌లో భారతీయ సంఘాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అమెరికా పర్యటన తరువాత ప్రధాని మోదీ ఈజిప్టుకు వెళ్తారు. 24న ఈజిప్టు రాజధాని నగరం కైరో చేరుకుంటారు ప్రధాని. పర్యటనలో భాగంగా భారతీయ మూలాలుగల ఈజిప్షియన్స్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. వాణిజ్య, ఆర్థిక సంబంధాల బలోపేతానికి మోదీ పర్యటన కీలకం కానుంది.

కాగా.. మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్‌లో హక్కుల ఉల్లంఘనను ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్స్‌. గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఈనెల 20న వాషింగ్టన్‌లో ప్రదర్శించనుంది. మోదీ ప్రభుత్వం అండతో హిందూత్వ సంస్థలు, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో మైనారిటీలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై అణచివేత లాంటి అంశాలను ఈ డాక్యుమెంటరీలో ప్రధానంగా చర్చించింది బీబీసీ. ముస్లింలపై అమలవుతున్న వివక్షను ప్రస్తావించింది.

భారత్‌లో మైనారిటీలపై అమలవుతున్న హింస, ముస్లింలపై వివక్షకు సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలను ప్రపంచం దృష్టికి తీసుకురావడమే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన లక్ష్యమని పేర్కొన్నాయి. మోదీ ప్రభుత్వం అండతో హిందూత్వ సంస్థలు, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో మైనారిటీలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై అణచివేత లాంటి అంశాలను ఈ డాక్యుమెంటరీలో ప్రధానంగా చర్చించారు. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన ద్వారా భారత్‌లో వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి చాటాలనుకుంటున్నాయి హక్కుల సంఘాలు. ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలు చేశారంటూ బీబీసీ డాక్యుమెంటరీని భారత్‌లో నిషేంధించింది ప్రభుత్వం. ఇప్పుడు ఇదే డాక్యుమెంటరీని అమెరికాలో ప్రదర్శిస్తుండడం గమనార్హం.

మరోవైపు దేశంలోని హక్కుల హననం గురించి ప్రధాని మోదీతో ప్రస్తావించాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కాంగ్రెస్‌ నేతలకు హక్కుల సంఘాలు లేఖరాశాయి. మీడియాపై కొనసాగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా బైడెన్‌ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించాలని కమిటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ కోరింది.

First Published:  20 Jun 2023 4:28 AM GMT
Next Story