Telugu Global
National

బలవంతుల‌ ముందు తలవంచడమే మోడీ జాతీయవాదం -మండిపడ్డ రాహుల్

ఎండలో, వానలో, చలిలో, మంచులో... అన్ని బాధలను తట్టుకొని వేలాదిమంది తనతో కాలుకలిపారని, వారికి ఈ దేశం మీద ఉన్న ప్రేమకు అది నిదర్శనమన్నారు రాహుల్.

బలవంతుల‌ ముందు తలవంచడమే మోడీ జాతీయవాదం -మండిపడ్డ రాహుల్
X

“ బలవంతుల‌ ముందు తలవంచడమే సావర్కర్ సిద్ధాంతం. అదే మోడీ అనుసరిస్తున్న జాతీయవాదం''' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పైనిప్పులు చెరిగారు.

''చైనా భారత్ కన్న పెద్ద ఆర్ధిక వ్యవస్థ అని, ఆ దేశంతో పోరాడలేమని జైశంకర్ అన్నారు. మరి భారత ప్రజలు స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడినప్పుడు మనది బ్రిటన్ కన్నా చిన్న ఆర్ధిక వ్యవస్థ‌ కాదా ?'' అని రాహుల్ ప్రశ్నించారు.

భారత్ జోడో యాత్రలో తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ, కన్యా కుమారి నుంచి కశ్మీర్ దాకా తనతో పాటు వేలాదిమందినడిచారని, వాళ్ళంతా నడిచింది తన కోసం కాదని దేశం కోసమని ఆయన అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు...ఇలా అనేక వర్గాలు తమ బాధలను తనతో పంచుకున్నారని, వాళ్ళ ఆవేదనను తాను అర్దం చేసుకున్నానని రాహుల్ తెలిపారు.

ఎండలో, వానలో, చలిలో, మంచులో... అన్ని బాధలను తట్టుకొని వేలాదిమంది తనతో కాలుకలిపారని, వారికి ఈ దేశం మీద ఉన్న ప్రేమకు అది నిదర్శనమన్నారు రాహుల్.

బీజేపీ నేత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతోందని, ప్రజల్లో చీలికలు తెస్తోందని రాహుల్ ఆరోపించారు. తాను కశ్మీర్ లో పర్యటించినప్పుడు అక్కడ మతం పేరుతో ప్రజలు వివక్షకు గురవుతున్నారనే విషయం అర్దం చేసుకున్నానని రాహుల్ గాంధీ తెలిపారు.

First Published:  26 Feb 2023 11:49 AM GMT
Next Story