Telugu Global
National

కాకులను కొట్టి గద్దలకు పెడ్తున్న‌ మోడీ సర్కార్...కార్పోరేట్లకు 10 లక్షల కోట్లు మాఫీ

మోదీ సర్కార్ ఒకవైపు పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ నిత్యావసరాలపై జీఎస్టీ సామాన్యుడు భరించలేని స్థాయిలో వేస్తూ కార్పోరేట్ కంపెనీలకు మాత్రం లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తోంది.

Narendra Modi
X

గత ఎనిమిదేండ్లుగా దిశా దశా లేని కేంద్రంలోని బీజేపీ సర్కార్ విధానాల ఫలితంగా దేశములో ద్రవ్య లోటు విపరీతంగా పెరిగిపోయింది. ఈ ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి దేశ ప్రజల మీద పన్నుల రూపంలో విపరీత భారం మోపుతోంది. జీఎస్టీ పేరుతో ఇప్పటికే పసిపిల్లలు తాగే పాలు మొదలు కొని, సామాన్య మానవుని దైనందిన జీవితంలో అవసరమైన ప్రతీ వస్తువు మీద్ద జీఎస్టీ పేరుతో భారం వేయడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు నేలను చూస్తున్నప్పటికీ.. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నీ తాకుతున్నాయి. 2014 సంవత్సరంలో లీటర్ పెట్రోల్ మీద 9.48 పైసలు. లీటర్ డీజిల్ మీద 3.56 పైసలు ఉన్న ఎక్సయిజ్ సుంకం బీజేపీ పాలనలో 2020 నాటికి లీటర్ పెట్రోల్ మీద 32.98 పైసలు, లీటర్ డీజిల్ మీద 31.83 పైసలకు చేరుకుంది. ఈ విషయాన్ని పార్లమెంటులో స్వయంగా కేంద్రమంత్రే వెల్లడించడం గమనార్హం.

ఇక గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే.. 2014లో 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలండ‌ర్ ధర ప్రస్తుతం 1150 రూపాయలకు చేరుకుంది. ఇదే క్రమంలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం కేంద్రం ప్రభుత్వం కేటాయిస్తున్న సొమ్ములో గత నాలుగు సంవత్సరాల నుండి క్రమంగా కోత పెడుతూ వస్తూ. ఇప్పడు ఏకంగా సబ్సిడీకి మంగళం పాడటం జరిగింది. మరోవైపు ఉచిత పథకాలు దేశ ఆర్ధిక వ్యవస్థకు చేటు తెస్తాయి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కేంద్రంలోని బీజేపీ పెద్దలు. దేశంలో ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా కేవలం దేశంలో సామాన్య ప్రజల పొట్టకొట్టడమే పనిగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.

ఇదిలా ఉంటే మరోవైపు దేశంలో బ్యాంకులకు రుణపడి ఉన్న కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లను రుణమాఫీ చేస్తున్నారు. ఈ ఏడు ఏండ్లలో కార్పొరేట్లకు 10 లక్షల కోట్ల రుణ మాఫీ చేసినట్లు పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ పక్షపాత వైఖరిని స్పష్టం చేస్తోంది. సంస్కరణల పేరుతొ సామాన్యుడి నడ్డివిరుస్తున్న కేంద్రం.. దేశంలో కార్పొరేట్లకు మాత్రం రుణమాఫీ చేయడం దేశంలో ఆర్ధిక వేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో జల్సాలు చేస్తున్న నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి బడా బాబుల విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మొత్తం మీద దేశంలో ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి కేంద్రంలోని బీజేపీ విధానాలు కేవలం సామాన్యుడినే టార్గెట్ చేసుకోవడం విచారకరం.

First Published:  3 Aug 2022 7:53 AM GMT
Next Story