Telugu Global
National

మైనార్టీ శాఖను రద్దు చేసేందుకు సిద్ధమైన మోడీ ప్రభుత్వం

మైనార్టీ హక్కులను పరిరక్షించాలని, జనాభా పరంగా తక్కువ సంఖ్యలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించాలనే ఉద్దేశంతో 2006లో యూపీఏ గవర్నమెంట్ మైనార్టీ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసింది.

మైనార్టీ శాఖను రద్దు చేసేందుకు సిద్ధమైన మోడీ ప్రభుత్వం
X

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం త్వరలో మైనార్టీ వ్యవహారాల శాఖను రద్దు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ శాఖను తొలగించేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. త్వరలోనే ఈ శాఖకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులను సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలో విలీనం చేయనున్నట్లు తెలుస్తున్నది. అలాగే మైనార్టీలకు సంబంధించిన ఏ కార్యక్రమాలైనా ఇకపై సామాజిక న్యాయ శాఖ నుంచే జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మైనార్టీ హక్కులను పరిరక్షించాలని, జనాభా పరంగా తక్కువ సంఖ్యలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించాలనే ఉద్దేశంతో 2006లో యూపీఏ గవర్నమెంట్ మైనార్టీ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి అల్పసంఖ్యాక వర్గాలైన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైనులకు ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను ఈ శాఖ ద్వారా కల్పిస్తూ వస్తున్నారు. బడ్జెట్‌లో ఈ శాఖకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఈ శాఖకు ప్రత్యేకంగా మంత్రి, సిబ్బంది ఉన్నారు. కాగా, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని మైనార్టీలైన ముస్లిం, క్రిస్టియన్లపై దాడులు పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తూ.. మైనార్టీల రక్షణను గాలికి వదిలేసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మైనార్టీ శాఖనే రద్దు చేయడం వారికి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు.

మైనార్టీ వ్యవహారాల శాఖను రద్దు చేయడం లేదని.. కేవలం సామాజిక న్యాయ శాఖలో విలీనం చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఇప్పుడు మైనార్టీ వ్యవహారాల శాఖ ద్వారా అమలు అవుతున్న పథకాలన్నింటినీ కొనసాగిస్తామని హామీ ఇస్తోంది. ప్రత్యేక శాఖ వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని.. అందుకే విలీనం చేస్తున్నామని వివరణ ఇచ్చింది. అప్పట్లో మైనార్టీలను మచ్చిక చేసుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఈ శాఖను ఏర్పాటు చేసిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. కాగా, మైనార్టీ వ్యవహారాల శాఖను రద్దు చేయడంపై రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీరుద్దీన్ హుస్సేన్ స్పందించారు. దేశంలో మతపరమైన రాజకీయాలు ఊపందుకొని, ఓ వర్గం వారిని టార్గెట్ చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. మైనార్టీలు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

First Published:  3 Oct 2022 11:51 AM GMT
Next Story